సాధారణంగా ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని దినకర్మ కార్యక్రమం జరుగుతుంది. ఇలా చేయడం ద్వారా మరణించిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని నమ్ముతారు. కానీ బిహార్‌లోని ముజఫర్‌పుర్ జిల్లా నివాసి అయిన హరిచంద్ర దాస్ జీవించి ఉండగానే తన దినకర్మను తానే చేసుకున్నాడు. గతేడాది కూడా ఇలానే తన దినకర్మను నిర్వహించుకున్నాడు. ఈ కార్యక్రమానికి అతడి బంధువులతో పాటు గ్రామ ప్రజలు హాజరయ్యారు.
ముజఫర్‌పుర్ జిల్లా సక్రా బ్లాక్‌లోని భారతీపూర్ గ్రామానికి చెందిన హరిచంద్ర దాస్ (75) ఏడాది క్రితం బతికి ఉండగానే తన దినకర్మను స్వయంగా చేసుకున్నాడు. ఇప్పుడు అతడు వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాడు. మొదటి సారి తన దినకర్మను చేయమని ఇంట్లో వాళ్లను అడగగా.. వారందరూ షాక్‌కు గురయ్యారు. అలా చేయొద్దని కుటుంబ సభ్యులు సహా గ్రామస్థులు సూచించారు. కానీ ఆయన అందుకు నిరాకరించాడు. దీంతో చేసేదేమీలేక వారు కూడా దినకర్మ చేసేందుకు అంగీకరించారు. హరిచంద్ర దాస్ తన వర్ధంతిని పూర్తి ఆచార వ్యవహారాలతో జరుపుకున్నాడు. అనంతరం రాత్రి విందు కూడా ఏర్పాటు చేశాడు.
"నా మరణానంతరం కొడుకులిద్దరూ దినకర్మను సరిగ్గా చేస్తారా లేదా అన్న సందేహం వచ్చింది. అందుకే నా దినకర్మను నేనే చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. నేను మతపరమైన స్వభావం గలవాడిని. కాబట్టి, మోక్షాన్ని పొందేందుకు జీవించి ఉండంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిద్దామని నిర్ణయించుకున్నాను. నా ఇద్దరు కొడుకులు, వేరే రాష్ట్రంలో ఉంటూ కష్టపడి పనిచేస్తున్నారు. నా ఆరోగ్య పరిస్థితి కారణంగా ఇప్పుడు ఏ పని చేయలేను. గ్రామంలో వ్యవసాయం చేస్తే కొద్దిపాటి ధాన్యం వస్తుంది."
- హరిచంద్ర దాస్, వృద్ధుడు.
ఇదీ చదవండి: హిమాచలంలో రాచరికం నెగ్గేనా? మార్పు వస్తుందా?
ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు లేవు.. అందువల్లే ఆలస్యం: సీఈవో