Krishna Board gave orders for release of water: తాగునీటి అవసరాల కోసం తెలంగాణకు 8.5, ఆంధ్రప్రదేశ్ కు 4.2 టీఎంసీల నీటి విడుదలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. నీటి కోసం వచ్చిన ప్రతిపాదనలపై రెండు రాష్ట్రాల ఈఎన్సీలను కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సంప్రదించారు. కోరినట్లుగా తెలంగాణకు పది, ఏపీకి ఐదు టీఎంసీల నీటి విడుదలకు త్రిసభ్య కమిటీ నిర్ణయించారు. అయితే నాగార్జునసాగర్ లో ప్రస్తుతం 12.731 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నందున అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేశారు.
జూలై తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడికాల్వ ద్వారా ఆంధ్రప్రదేశ్ కు 4.20 టీఎంసీలు విడుదలకు ఆదేశాలు ఇచ్చారు. సెప్టెంబర్ వరకు తాగునీటి అవసరాల కోసం సాగర్ నుంచి తెలంగాణకు 8.50 టీఎంసీలు విడుదలకు ఆదేశాలు ఇచ్చారు. సాగర్ నుంచి జూన్, జూలై నెలలో తెలంగాణ వాడుకున్న 5.282 టీఎంసీలను త్రిసభ్య కమిటీ ర్యాటిఫై చేసింది. వీలైనంత వరకు పవర్ హౌసెస్ ద్వారానే నీరు విడుదల చేయాలని కృష్ణా బోర్డు స్పష్టం చేసింది.
- ALSO READ: నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తి నీటి విడుదల
తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడికాల్వకు ఐదు టీఎంసీల నీరు విడుదల చేయాలని గతంలో ఏపీ పలుమార్లు కృష్ణా బోర్డును కోరింది. తమ విజ్ఞప్తి మేరకు నీటి విడుదల ఉత్తర్వులు ఇవ్వాలని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శిని కోరారు. ప్రస్తుత నీటి సంవత్సరం ప్రారంభమై రోజులు పూర్తైనప్పటికీ నదుల్లోకి పెద్దగా ప్రవాహాలు లేవు. గోదావరిలో కొంత మేర ఉన్నప్పటికీ కృష్ణాలో మాత్రం పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. ఇప్పటి వరకు ఎగువ నుంచి ప్రవాహాలు లేవు. ఉపనది తుంగభద్ర నుంచి కూడా ఆశించిన మేర నీరు కృష్ణాలోకి చేరడం లేదు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లోకి ఇప్పటి వరకు నీరు చేరలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న ఉమ్మడి జలాశయాల్లో నీటిమట్టం కనీస స్థాయిలోనే ఉంది.
గత ఏడాది రెండు రాష్ట్రాలు పోటీ పడి దిగువకు వదలడంతో రెండు జలాశయాల్లో కనీస నీటిమట్టం మిగిలిపోయింది. రెండు జలాశయాల్లోకి ఈ ఏడాది ఇప్పటికి నీరు చేరలేదు. ఎగువ నుంచి ప్రవాహాలు ఇప్పట్లో వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో కృష్ణాపై ఆధారపడ్డ సాగు, తాగు నీటి అవసరాలకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఇవాళ కేఆర్ఎంబీ సభ్యకార్యదర్శి రాయిపురే నేతృత్వంలో వర్చువల్ విధానంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది.