Railways Providing Meals at Rs 20 for General Coach Passengers : రైలు ప్రయాణంలో రిజర్వేషన్ చేసుకున్న వారికి అందే సౌకర్యాల గురించి మనకు తెలుసు. అదే సమయంలో జనరల్ బోగీల్లో ఉండే అవస్థలు కూడా తెలుసు. ఈ జనరల్ కంపార్ట్ మెంట్లో సుదూర ప్రయాణం చేసేవారు చాలా ఇబ్బందులు పడతారు. ఇందులో.. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలే ప్రయాణిస్తుంటారు. గమ్యం చేరే వరకూ సరైన భోజనం కూడా చేయలేరు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని.. జనరల్ బోగీల్లోని వారికి ఆహార పదార్థాలను అందించాలనే నిర్ణయానికి రైల్వే శాఖ(Indian Railways) వచ్చింది.
ఈ భోజనం.. ఆయా స్టేషన్లలో జనరల్ బోగీలు ఆగే చోట ఈ ఆహార పదార్థాలను ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులో ఉంచుతారు. ఇంతకీ ఏయే ఆహార పదార్థాలను ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతారు..? డబ్బులు దేనికి ఎంత చెల్లించాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Railways Serving Affordable Meals for General Coach Passengers : రైల్వే బోర్డు అందించే ఈ జనరల్ కోచ్ మీల్స్‌ను రెండు కేటగిరీలుగా వర్గీకరించారు. మొదటి కేటగిరీలో.. ఏడు పూరీలు, డ్రై ఆలూ, పికిల్‌తో కూడిన ఆహారాన్ని అందిస్తారు. దీని ఖరీదు 20 రూపాయలు. రెండో కేటగిరీ ఆహారం ధర రూ.50గా నిర్ణయించారు. ఇందులో.. అన్నం, ఛోలే, రాజ్మా, కిచిడీ, కుల్చే, పావ్ బాజీ, భతురే, మసాలా దోశ.. ఇలా వీటిలో ఏదో ఒక ఆహారాన్ని ప్రయాణికులు(General Coach Passengers) తీసుకోవచ్చు. ఆహారంతో పాటు 200 మిల్లీలీటర్ల వాటర్ ప్యాకెట్ కూడా అందిస్తారు.
Meals for General Coach Passengers at Rs 20 in Trains : జనరల్ కోచ్‌ల్లో రిజర్వేషన్ లేని కారణంగా.. ప్రయాణికులు కిక్కిరిసి జర్నీ చేస్తుంటారు. చాలా సార్లు నిలబడేందుకూ చోటు ఉండదు. ఇలా అవస్థలు పడుతూ ప్రయాణించేవారికి.. తక్కువ ధరకే భోజనం అందించాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఆహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన కౌంటర్ల ఎక్కడ ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని రైల్వే బోర్డు(Railway Board) జోనల్ రైల్వే అధికారులకు అధికారం అప్పగించింది.
ఆరు నెలల పైలట్ ప్రాజెక్టు..
తొలుత ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టాలని నిర్ణయించారు. జూలై 20న లాంఛ్ చేసిన ఈ కార్యక్రమం.. ప్రస్తుతం దేశంలోని 64 స్టేషన్లలో మాత్రమే అందుబాటులో ఉంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో.. హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, రేణిగుంటలో అమలవుతోంది. ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందనను బట్టి.. త్వరలోనే మరిన్ని స్టేషన్లలో ఈ కౌంటర్లు అందుబాటులోకి రానున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Railways Serve Biryani for Passengers at Low Cost : అయితే.. ఇప్పటికే ఈ కౌంటర్లకు మంచి ఆదరణ వస్తోందని అధికారులు చెబుతున్నారు. దీంతో.. బిర్యానీని కూడా సాధారణ డిన్నర్ ఎంపికగా మార్చాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. అయితే.. ధర మాత్రం కాస్త ఎక్కువగా ఉంటుంది. వెజ్ బిర్యానీ 350 గ్రాములు 70 రూపాయలుగా ఉంది. గుడ్డుతో కూడిన బిర్యానీ 80 రూపాయలు. 350 గ్రాముల చికెన్ బిర్యానీ ధర 100 రూపాయలు. ఈ బిర్యానీకి డిమాండ్ పెరుగుతున్నప్పటికీ.. 20 రూపాయలకు అందించే భోజనం కూడా కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు.