చైనా, పాకిస్థాన్ వంటి దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ.. సైనిక, ఆయుధ శక్తిని పటిష్ఠపర్చుకునే దిశగా భారత్ వడివడిగా అడుగులు వేస్తోంది. రూ.1.5 లక్షల కోట్లతో 114 యుద్ధ విమానాలను సమకూర్చుకోవాలనుకుంటున్న భారత్ వాటిలో 96 యుద్ధ విమానాలను స్వదేశంలోనే తయారు చేసేందుకు సిద్ధమవుతోంది. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో వీటిని రూపొందించనున్నారు. మిగిలిన 18 యుద్ధ విమానాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోనున్నారు.
'బై గ్లోబల్- మేకిన్ ఇండియా' పథకం కింద ఈ 114 యుద్ధ విమానాలను సమకూర్చుకోనుంది భారత్. ఈ మేరకు విదేశీ సంస్థలతో భాగస్వామ్యం అయ్యేందుకు భారత కంపెనీలకు అవకాశం కల్పిస్తారు. ఇటీవల భారత వైమానిక దళం.. విదేశీ యుద్ధ విమాన తయారీ సంస్థలతో సమావేశం నిర్వహించింది. మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగస్వామ్యం అవడంపై ఇందులో వారు చర్చించారు. ప్రణాళికలో భాగంగా తొలుత 18 యుద్ధ విమానాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. తదుపరి 36 యుద్ధ విమానాలను భారత్‌లోనే తయారు చేస్తారు. వీటికి విదేశీ కరెన్సీ, భారత కరెన్సీలలో చెల్లింపులు ఉంటాయి. ఇక చివరి 60 యుద్ధ విమానాల బాధ్యత పూర్తిగా భారత కంపెనీలదే. చెల్లింపులు కూడా కేవలం భారత కరెన్సీలోనే ఉంటాయి.
ప్రత్యర్థి దేశాలు పాకిస్థాన్, చైనాపై పైచేయి సాధించేందుకు ఈ 114 యుద్ధ విమానాలు భారత వైమానిక దళానికి కీలకంకానున్నాయి. ఇప్పటికే 36 రఫేల్ యుద్ధ విమానాలు భారత అమ్ములపొదిలో చేరాయి. ఐతే భారత వైమానిక దళ సామర్థ్యాన్ని మరింత పెంచుకునేందుకు ఇంకా అనేక యుద్ధ విమానాలు భారత వైమానిక దళానికి అవసరం అవుతున్నాయి. ముఖ్యంగా పాతవిగా మారిన మిగ్ సిరీస్ యుద్ధ విమానాలను కొత్త వాటితో భర్తీ చేయాలని భారత వైమానిక దళం కోరుకుంటోంది. ఐదో తరం అడ్వాన్స్డ్ మీడియం యుద్ధ విమానాల ప్రాజెక్టు సంతృప్తికర స్థాయిలో ముందుకు సాగుతోంది. అయితే అవి మన చేతికి అందేసరికి చాలా సమయం పడుతుంది. నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండి, ఎక్కువ సామర్థ్యం ఉన్న యుద్ధ విమానాల కోసం భారత్ చూస్తోంది. రఫేల్ యుద్ధ విమానాలపై సంతృప్తిగా ఉన్నభారత వైమానిక దళం.. భవిష్యత్తు యుద్ధ విమానాలు కూడా అలాంటి సామర్థ్యాలను కలిగి ఉండాలని కోరుకుంటోంది.
ఇదీ చదవండి: 'నా ఫ్యామిలీ ప్రమాదంలో ఉంది.. ఆ వివరాలు ఎవరికీ చెప్పొద్దు ప్లీజ్'