India Book of Records 2021 Kerala: కేరళ కాసరగోడ్‌కు చెందిన రెండున్నరేళ్ల చిన్నారి బాల పార్వతి తన జ్ఞాపకశక్తితో ఔరా అనిపిస్తోంది. మంత్రుల పేర్లను చకచకా చెప్పేస్తోంది. అంతేకాదు.. స్వాతంత్య్ర సమరయోధులు, పలు దేశాల జెండాల ఫొటోలను తన ముందు పెడితే ఇట్టే గుర్తుపడుతోంది. చిన్నవయసులోనే ఈ అసాధారణ ప్రతిభతోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ చోటు దక్కించుకుంది.
కాసరగోడ్‌కు చెందిన హరీశ్, సుకన్య దంపతుల ఏకైక కుమార్తె బాల పార్వతి. ఏడాది వయసులోనే తన కుమార్తెలో ప్రత్యేక ప్రతిభను గుర్తించారు హరీశ్, సుకన్య. జనరల్ నాలెడ్జ్ సహా పలు అంశాలపై అవగాహన కల్పించారు. దగ్గరుండి అన్నీ నేర్పించారు. ఈ క్రమంలోనే నేపథ్య సంగీతం విని.. ఆ పాటలను పసిగట్టే నైపుణ్యాన్ని పార్వతి సొంతం చేసుకుంది. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో పాటలను పాడేస్తోంది. ఈ ప్రతిభతో అందరితో 'వావ్' అనిపించుకుంటోంది.
"ఏమి తెలియని వయసులోనే మా వద్దకు పుస్తకాలు తీసుకొచ్చి.. అందులో ఏమున్నాయో చెప్పమని మమ్మల్ని అడిగేది. అలా మేము ఆమెకు చాలా విషయాలు నేర్పడం ప్రారంభించాం. తర్వాత వాటిని అడిగితే తడబడకుండా సమాధానం చెబుతుంది."
- సుకన్య, బాల పార్వతి తల్లి
"పార్వతి.. జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు సమాధానమివ్వడంలో అసాధారణ ప్రతిభను ప్రదర్శించింది. దీనిని చూసి.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం దరఖాస్తు చేశాం. తర్వాత అధికారులు ఆమెకు పరీక్ష నిర్వహించి ఎంపిక చేశారు. దీంతో నా కుమార్తె స్థానికంగా స్టార్‌గా మారిపోయింది" అని పార్వతి తండ్రి హరీశ్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'కిడ్ ఆఫ్ ది ఇయర్'.. ఫొటో చూసి పేరు చెప్పేస్తుంది!