ఆడుతూ.. పాడుతూ.. గడపాల్సిన వయసులో వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది ఓ విద్యార్థిని. సరికొత్త ఆలోచనతో విద్యార్థుల కోసం 'మల్టీ స్పెషాలిటీ బ్యాగ్'ను తయారుచేసింది. బస్ కోసం ఎదురుచూసే పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ అద్భుతమైన బ్యాగ్‌ను రూపొందించింది.
హిమాచల్ ప్రదేశ్‌లోని ఊనా జిల్లాకు చెందిన ఏకమ్జిత్ కౌర్ అనే బాలిక ఈ 'మల్టీ స్పెషాలిటీ బ్యాగ్'ను తయారుచేసింది. రాక్‌ఫోర్డ్ డే పబ్లిక్ స్కూల్లో చదువుతున్న ఏకమ్జిత్ ఇటీవలే ఇన్‌స్పైర్ స్టాండర్డ్ అవార్డ్ స్కీమ్ పోటీల్లో పాల్గొంది. ఆ సమయంలో ఆమె తయారు చేసిన స్కూల్ బ్యాగ్‌ను అక్కడకు తీసుకొచ్చింది. తన బ్యాగ్ ఉపయోగాలను అక్కడికి వచ్చిన న్యాయనిర్ణేతలకు వివరించింది. దీంతో వారంతా అవాక్కయ్యారు. అయితే ఈ బ్యాగ్ విలువ రూ.500 నుంచి రూ.1,000 మధ్యలో ఉంటుందని చెబుతోంది.
"నా పేరు ఏకమ్‌జీత్ కౌర్. ఊన్నా జిల్లాలో రాక్‌ఫోర్డ్ డే పబ్లిక్ స్కూల్ రక్కడ్ కాలనీలో నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను. కొంత మంది పిల్లలు బ్యాగులు భుజాన వేసుకుని బస్ కోసం వేచి ఉండటం చూశాను. అది వాళ్లకు ఇబ్బందిగా ఉండేది. దాంతో కుర్చునేందుకు వీలుగా నేను ఓ బ్యాగ్ తయారుచేశాను".
-ఏకమ్‌జీత్ కౌర్, విద్యార్థిని
ఈ బ్యాగ్ విద్యార్థులకు చాలా విధాలుగా ఉపయోగపడుతుందని విద్యార్థిని చెబుతోంది. బ్యాగ్‌లో ఓ ఫోల్డబుల్ కుర్చీ కూడా ఉందని.. బస్ కోసం ఎదురుచూసే విద్యార్థులు గంటల కొద్దీ నిలబడాల్సిన అవసరం లేకుండా కుర్చీ వేసుకుని దర్జాగా కూర్చోవచ్చని చెప్పింది. అంతేకాకుండా బరువైన పుస్తకాలను మోసుకుని వెళ్లకుండా బ్యాగ్‌ను సులువుగా లాక్కెల్లేందుకు చక్రాలు కూడా ఉన్నాయని తెలిపింది. స్కూల్ పిల్లల కోసం ఆమె చేసిన ఈ అద్భుతమైన బ్యాగ్‌ను చూసిన వాళ్లంతా విద్యార్థినిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.