Gujarat Elections 2022 Results: రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. మొత్తం రెండు విడతల్లో పోలింగ్ జరగ్గా ఓట్ల లెక్కింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
- అసెంబ్లీ స్థానాలు- 182
- కౌంటింగ్ కేంద్రాలు-37
- అభ్యర్థుల సంఖ్య- 1,621
ప్రముఖుల భవితవ్యమేంటో?
గుజరాత్ ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఆమ్‌ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గద్వి, యువ నాయకులు హార్దిక్ పటేల్, జిగ్నేశ్ మెవానీ, అల్పేష్ ఠాకూర్, క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా వంటి ప్రముఖల భవితవ్యం గురువారం తేలిపోనుంది.
వరుసగా ఏడోసారి?
గుజరాత్‌లో అధికార భాజపా వరుసగా ఏడోసారి జయభేరి మోగించాలని ఊవిళ్లూరుతోంది. ఎగ్జిట్ పోల్స్ కూడా భాజపా విజయం తథ్యమని అంచనా వేశాయి. గుజరాత్‌లో అధికారం చేపట్టేందుకు అవసరమైన మెజార్టీ మార్క్ 92 సీట్లు కాగా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం భాజపాకు 117 నుంచి 151 సీట్ల వరకు రావచ్చని లెక్కగట్టాయి. కాంగ్రెస్ పార్టీకి 16 నుంచి 51, ఆమ్‌ఆద్మీకి 2 నుంచి 13 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాయి.
రెండు విడతల్లో..
గుజరాత్ తొలి దశ ఎన్నికలు డిసెంబరు 1న జరగ్గా.. రెండో విడత ఎన్నికలు డిసెంబరు 5న ప్రశాంతంగా జరిగాయి. మొదటి విడతలో 63.31 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికలు అధికారుల వెల్లడించారు. ఇక రెండో విడతలో 65.22 శాతం పోలింగ్ రికార్డైనట్లు ఈసీ వెల్లడించింది.
2017 ఎన్నికల్లో..
2017 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 99 సీట్లు, కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకున్నాయి. బీటీపీకి రెండు, ఎన్సీపీకి ఒకటి, ముగ్గురు స్వతంత్రులు విజయం సాధించారు. ఈ ఏడాది ఎన్నికలు జరిగే సమయానికి భాజపా సభ్యుల సంఖ్య 110కు చేరింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 60కి తగ్గింది. గత ఐదేళ్లలో కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన 20 ఎమ్మెల్యేలు భాజపాలో చేరారు. వారిలో ముగ్గురు ఎన్నికలకు ముందు పార్టీ మారారు.