Government Doctors Negligence : వైద్యుల నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. తలకు గాయమైన ఓ వ్యక్తికి చికిత్స చేసి.. కుట్లు వేసే సమయంలో ఓ ఇనుప నట్టును అక్కడే వదిలేశారు. దీంతో బాధితుడికి రక్తస్రావం ఆగలేదు. వెంటనే అతడి కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ స్కాన్ చేయగా తలపై కుట్లు వేసిన ప్రదేశంలో ఇనుప నట్టును చూసి వైద్యులు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
ఇదీ జరిగింది..
Iron Nut In Patient Head : తిరుపత్తూరు జిల్లా వానియాంబాడీ ప్రాంతంలోని ఉదయేంద్రం గ్రామానికి చెందిన కార్తికేయన్.. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో మాదనూరు సమీపంలో కార్తికేయన్ నడుపుతున్న లారీని, వెనుక నుంచి వచ్చిన ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఆ తర్వాత లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో బోల్తా పడింది. తలకు బలమైన గాయాలైన కార్తికేయన్‌ను స్థానికులు రక్షించి.. వేలూరులోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. బాధితుడికి చికిత్స చేసి.. తలకు కుట్లు వేశారు అక్కడి వైద్యులు. అయినా రక్తస్రావం ఆగకపోవడం వల్ల కార్తికేయన్‌ను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు అతడి కుటుంబ సభ్యులు. అక్కడ స్కాన్ చేసిన వైద్యులు.. బాధితుడి తలకు కుట్లు వేసిన ప్రదేశంలో ఇనుప నట్టు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆ నట్టును తీసేశారు. అయితే, గాయమైన ప్రదేశంలో ఇన్ఫెక్షన్ అయిందని.. రెండు రోజుల తర్వాత మళ్లీ కుట్లు వేస్తామని వైద్యులు తెలిపారు.
వైద్యుల నిర్లక్ష్యంపై బాధితుడి బంధువులు స్పందించారు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఉదాసీనంగా వ్యవహరించారని ఆరోపించారు. ఆస్పత్రికి తీసుకెళితే వైద్యులు చికిత్స చేయలేదని.. బాధితుడు బాగానే ఉన్నాడు, ఇంకా స్పృహలోనే ఉన్నాడని నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పారని ఆరోపించారు. ఆ తర్వాత గట్టిగా అడిగితే చికిత్స చేసి తలపై నట్టు పెట్టి కుట్లు వేశారని మండిపడ్డారు. ఈ ఘటనపై వేలూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రి డీన్ డాక్టర్ పాపాపతిని వివరణ కోరగా.. ఇప్పటివరకు తనకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
వెన్నుపూసలో సర్జికల్ సూది!
వైద్యుల నిర్వాకం రోగుల ప్రాణాల మీదకు తేవడం ఇదేం మొదటి సారి కాదు. ఇలాంటి ఘటనలు కోకొల్లలు జరిగాయి. గతంలో ఓ మహిళ తీవ్ర నడుము నొప్పితో బాధపడింది. కనపడిన ఆస్పత్రులన్నీ తిరిగింది. చూపించుకున్న వైద్యులందరూ.. ఆమెది సజహంగా వచ్చే నొప్పిగానే భావించి అందుకు తగిన మందులు రాసి పంపించేశారు. కానీ.. అవేమి ఆ మహిళకు ఉపశమనం కలిగించలేదు. ఇలా.. అన్ని ఆస్పత్రులకు కలిపి 4 లక్షలకు పైగానే ఖర్చు చేసింది. నాలుగేళ్లకు పైగా నరకయాతన అనుభవించింది. ఆఖరుకు ఓ ఆస్పతికి వెళ్లగా.. అనుమానం వచ్చిన వైద్యుడు ఎక్స్‌రే తీశాడు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆమె వెన్నుపూసలో సర్జికల్ సూది బయటపడింది. ఇంతకీ ఆమె వెన్నుపూసలోకి ఆ సుది ఎలా వెళ్లిందో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.