తన సోదరుడితో గొడవ పడి ఓ యువతి కీప్యాడ్ సెల్‌ఫోన్‌ను మింగేసింది. వాంతులతో, తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పొట్టలో సెల్‌ఫోన్ ఉన్నట్లు గుర్తించిన వైద్యులు.. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి.. శస్త్ర చికిత్స చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.
అసలు ఏం జరిగిందంటే.. మధ్యప్రదేశ్‌లోని భిండ్‌కు చెందిన అను అనే 18 ఏళ్ల అమ్మాయి.. తన సోదరుడితో గొడవ పడింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపం చెందిన అను.. కీప్యాడ్ ఉన్న చైనీస్ మొబైల్ ఫోన్‌ను మింగేసింది. అనంతరం వాంతులు చేసుకోవడం మొదలు పెట్టింది. కడుపు నొప్పి కూడా తీవ్రమైంది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసిన వెంటనే.. గ్వాలియర్‌లోని జయారోగ్య ఆస్పత్రికి తరలించారు. ఆ అమ్మాయికి ఎక్స్‌రే, అల్ట్రా సౌండ్, సీటీ స్కాన్ పరీక్షలు నిర్వహించి.. ఆమె పొట్టలో సెల్ ఫోన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అనంతరం దాదాపు రెండు గంటల పాటు శ్రమించిన వైద్యులు.. కష్టతరమైన శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తిచేసి సెల్ ఫోన్‌ను బయటకు తీశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తర్వలోనే డిశ్ఛార్జ్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు.
ఇలాంటి కేసు తన కెరీర్‌లో చూడలేదని.. రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న వైద్య నిపుణుడు డాక్టర్ కుష్వాహా తెలిపారు. చిన్న పిల్లలకు సెల్ ఫోన్లు అప్పగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. అలాంటి పరికరాలు అందించేటప్పుడు తల్లిందండ్రులు తమ పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు.
సెల్‌ఫోన్ మింగిన ఖైదీ..
ఇలాంటి ఘటన ఇంతకుముందు కూడా జరిగింది. బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా జైలులో ఒక ఖైదీ సెల్‌ఫోన్ మింగేసి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఖైదీల దగ్గర ఫోన్లు ఉన్నాయన్న సమాచారంతో అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో అతడు ఇలా చేశాడు. ఆ వ్యక్తికి విపరీతమైన కడుపు నొప్పి రావడం వల్ల ఏం జరిగిందా అని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. వెంటనే అతడిని జైలు సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
బ్లేడ్‌ను మింగిన చిన్నారి..
కోల్‌కతాలో 11 నెలల చిన్నారి బ్లేడ్ మింగాడు. దీంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అనంతరం అతడి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు 45 నిమిషాల పైటు కష్టపడి శస్త్ర చికిత్స చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.