Girl Fell Into Borewell In Uttarpradesh : ఉత్తర్‌ప్రదేశ్.. షాజహాన్‌పుర్ జిల్లాలో బోరుబావిలో పడ్డ ఓ రెండేళ్ల బాలికను సహాయక బృందాలు సురక్షితంగా కాపాడాయి. బోరుబావికి సమాంతరంగా జేసీబీతో గొయ్యిని తవ్వి.. రెండు గంటల శ్రమ అనంతరం బాలికకు రక్షించాయి. చిన్నారిని బయటకు తీసిన వెంటనే అధికారులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ జరిగింది.. నిగోహి పోలీస్ స్టేషన్ పరిధిలోని విరాసిన్ గ్రామంలో అభిషేక్ అనే వ్యక్తి.. తన భార్య శాలిని, రెండేళ్ల కుమార్తెతో నివాసం ఉంటున్నాడు. శనివారం ఉదయం 10 గంటలకు సమయంలో బాలిక ఇంటి బయట ఆడుకుంటోంది. ప్రమాదవశాత్తు ఇంటికి కొంత దూరంలో 25 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయింది. చిన్నారి కనిపించకపోయే సరికి కంగారు పడిన బాలిక తల్లి.. చుట్టుపక్కల వెతికింది. అయితే, కొద్ది సేపటి తర్వాత బాలిక రోదనలు విన్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చుట్టుపక్కల జనం కూడా గుమిగూడారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం జేసీబీని పిలిపించి సహాయక చర్యలు చేపట్టారు. బోరుబావికి సమాంతరంగా గుంత తీసి.. రెండు గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత బాలికను బకెట్ సహాయంతో సురక్షితంగా బయటకు తీశారు. బాలిక ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండటం, ఆమె శరీరంపై గాయాలు ఉండటం వల్ల వెంటనే బాలికను కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటం వల్ల.. వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్పించారు. మరోవైపు.. ఈ ఘటనపై పోలీసులు చురుగ్గా వ్యవహరించారని.. ఆలస్యమైతే బాలిక ప్రాణం పోయేదని గ్రామస్థులు తెలిపారు. బాలికకు చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ అన్మోల్ తెలిపారు.
బోరు బావిలో పడ్డ బాలుడు..
ఇటీవల ఇలాంటి ఘటన బిహార్ నలంద జిల్లాలోని కుల్ గ్రామంలో జరిగింది. ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయిన బాలుడు.. 40 అడుగుల లోతులో ఇరుక్కుపోయాడు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు బోరుబావికి సమాంతరంగా జేసీబీలతో గొయ్యిని తవ్వి.. గంటల శ్రమ అనంతరం బాలుడికి పునర్జీవితం ప్రసాదించారు. ఈ వీడియో చూడాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.