కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దాదాపు ఏడాదిగా నిరసనలు చేపడుతున్న రైతులు.. ఉద్యమాన్ని ఉద్ధృతం చేసే క్రమంలో ఈ నెల 29న పార్లమెంట్‌కు కవాతు నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. సంయుక్త్ కిసాన్ మోర్చాకు చెందిన తొమ్మిది మంది సభ్యుల కమిటీ మంగళవారం ఈ నిర్ణయం తీసుకుంది.
29న గాజీపుర్, టిక్రీ సరిహద్దుల నుంచి రైతులు తమ ట్రాక్టర్లలో పార్లమెంట్ వైపు బయల్దేరుతారని వారు వెల్లడించారు. మధ్యలో వారిని ఎక్కడైనా అడ్డగిస్తే.. అక్కడే నిరననకు దిగుతారని చెప్పారు. ఈ ఏడాది జులైలోనూ వర్షాకాల సమావేశాల సమయంలో రైతులు ఓసారి పార్లమెంట్ దగ్గర నిరసన చేపట్టారు. వివిధ పార్టీల నేతలూ వారికి సంఘీభావం ప్రకటించారు.
నవంబర్ 26లోగా సంబంధిత వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, లేనిపక్షంలో నిరసనలు ఉద్ధృతం చేస్తామని రైతు సంఘాల నేతలు ఇదివరకే కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. ఇదే క్రమంలో ఈ నెల 22న లఖ్‌నవూలో మహాపంచాయత్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం చరిత్రాత్మకం కానుందని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ మంగళవారం పేర్కొన్నారు.
ఇకముందు ఉత్తర్‌ప్రదేశ్‌లోని పుర్వాంచల్ ప్రాంతంలోనూ అన్నదాతల ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్నట్లు తెలిపారు. దాదాపు ఏడాది కాలంగా రైతులు నిరసనలు తెలుపుతున్నా.. కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి: