Jammu and Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లోని చద్ధా క్యాంపు సమీపంలో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. సీఐఎస్ఎఫ్ బలగాలు ప్రయాణిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకొని తుపాకులు, గ్రనేడ్లతో విరుచుకుపడ్డారు. తెల్లవారుజామున నాలుగున్నర ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో ఓ ఏఎస్సై ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు జవాన్లు గాయపడ్డారు. జవాన్లు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతమయ్యారు.
దాడి సమయంలో బస్సులో 15మంది జవాన్లు ఉన్నట్లు సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఉగ్రదాడిని బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టగా వారి తప్పించుకునేందుకు ఉగ్రవాదులు సమీపంలోని సుంజ్వాన్ ప్రాంతానికి జారుకున్నారు. ఈ క్రమంలో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించగా.. వారిపైనా ముష్కరులు ఎదురుకాల్పులు జరిపారు.
బారాముల్లాలో నలుగురు ఉగ్రవాదులు హతం: జమ్ముకశ్మీర్ బారాముల్లాలో ఉగ్రవాదులు, భద్రతాబలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు గాయపడ్డారు. సుంజ్వాన్ ప్రాంతంలో కాల్పులు జరగగా ఆపరేషన్ కొనసాగుతున్నట్లు జమ్ము అడిషనల్ డీజీపీ ముకేశ్‌సింగ్ తెలిపారు. సైనికులు సహా గాయపడిన పోలీసులను స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించినట్లు పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ జమ్ము పర్యటన నేపథ్యంలో ఉగ్రవాద కదలికలు ఉన్నాయనే సమాచారం మేరకు సుంజ్వాన్ ప్రాంతంలో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో ముష్కరులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. బలగాలపైకి గ్రనేడ్లు విసిరిశారు. సుంజ్వాన్ మిలిటరీ స్టేషన్‌కు ఆనుకుని ఉన్న ప్రాంతంలో పాక్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు బలగాలు భావిస్తున్నాయి. వారిని పట్టుకునేందుకు ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. ముందు జాగ్రత్తగా ఇంటర్నేట్ సేవలను, పాఠశాలలను మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ నెల 24న జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ జమ్ములోని పాలి గ్రామాన్ని సందర్శించనున్నారు. 2019లో జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి హోదా రద్దు అనంతరం తొలిసారిగా జమ్ములో పర్యటించనున్నారు. అంతకుముందు 2019 అక్టోబర్ 27న రాజౌరి, నవంబర్ 3 2021న నౌషేరా సెక్టార్లో జవాన్లతో కలిసి మోదీ దీపావళి వేడకులు చేసుకున్నారు.
ఇదీ చదవండి: భారత్, రష్యా బంధాన్ని అందరూ అర్థం చేసుకున్నారు: జాన్సన్