Diwali 2023 : జీవితంలోని చీకట్లను పారదోలుతూ.. వెలుగులు నింపే పండగగా, విజయానికి గుర్తుగా దివాళీని జరుపుకుంటారు. నరకాసురుడనే రాక్షసుడు అంతమైన మరుసటి రోజున.. పీడ విరగడైందన్న ఆనందంలో ప్రజలు దీపావళి సంబరాలు చేసుకుంటారని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ పండగ రోజున.. ప్రతి ఇల్లూ దీపపు కాంతులతో వెలిగిపోతుంది. ప్రతి ఇంటా.. లక్ష్మీ పూజ, బాణసంచా మోతలు మోతెక్కిపోతాయి.
అయితే.. ఈ ఏడాది దీపావళి ఏ రోజున జరుపుకోవాలనే సందేహం చాలా మందిలో ఉంది. ప్రతియేటా దీపావళి ఆశ్వయుజ అమావాస్య(Amavasya) రోజున వస్తుంది. అలాగే దీనికి ముందు రోజు వచ్చే ఆశ్వయుజ బహుళ చతుర్థశిని నరక చతుర్థశిగా జరుపుకుంటారు. మరి.. ఆ తిథి ఎప్పుడు వచ్చింది? నవంబర్ 12నా? 13వ తేదీనా? అనేదానిపై జనాల్లో స్పష్టత లేదు. మరి పంచాంగం ఏం చెబుతోంది? అన్నది ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా హిందువుల పండుగల్లో తిథి సూర్యోదయానికి ఉండడమే లెక్క. కానీ.. దీపావళి లెక్క వేరే. సాయంత్రం లక్ష్మీపూజ చేసి, దీపాలు వెలిగిస్తారు. కాబట్టి అమావాస్య ఘడియలు ఉన్న సాయంత్రం రోజునే పరిగణనలోకి తీసుకోవాలి. అయితే.. అమావాస్య ఘడియలు 12, 13 తేదీల్లో విస్తరించి ఉండడంతో చాలా మందిలో గందరగోళం నెలకొంది. దీనిపై పండితులు స్పష్టత ఇస్తున్నారు. నవంబర్ 12వ తేదీ ఆదివారం మధ్యాహ్నం నుంచి అమావాస్య ఘడియలు మొదలై.. 13వ తేదీ సోమవారం మధ్యాహ్నం ముగుస్తున్నాయట. కాబట్టి.. సాయంత్రం ఉండే అమావాస్య ఘడియలను లెక్కలోకి తీసుకొని.. 12వ తేదీనే దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
ధనత్రయోదశి నాడు ఈ 5 వస్తువులు తప్పక కొనుగోలు చేయాలి - ఎందుకో తెలుసా?
ఒకే రోజు నరక చతుర్థశి - దీపావళి : సాధారణంగా దివాళీకి ముందు రోజు నరక చతుర్థశి వస్తుంది. కాబట్టి.. 12వ తేదీన దీపావళి జరుపుకుంటే.. నరక చతుర్థశి 11వ తేదీ అవుతుందని అనుకోవద్దని చెబుతున్నారు. ఎందుకంటే.. చతుర్థశి తిథి సూర్యోదయానికి ఉన్నదే పరిగణలోకి తీసుకుంటారట. అందువల్ల.. 12న ఆదివారం సూర్యోదయానికి చతుర్థశి తిథి ఉండడంతో.. ఆ రోజునే ఉదయం నరకచతుర్థశి జరుపుకోవాలని.. సాయంత్రానికి అమావాస్య తిథి వస్తుండడంతో అదే రోజు రాత్రి దీపావళి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
చతుర్థశి, అమావాస్య ఘడియలు ఇలా (Diwali 2023 Date and Timings) :
- దీపావళికి ఆశ్వయుజ బహుళ చతుర్ధశి, అర్ధరాత్రి అమావాస్య ప్రామాణికం.
- నవంబర్ 11 శనివారం మధ్యాహ్నం 12.50 వరకూ త్రయోదశి తిథి ఉంది. ఆ తర్వాత నుంచి చతుర్ధశి ఘడియలు మొదలవుతాయి.
- చతుర్థశి తిథి 11వ తేదీ శనివారం మధ్యాహ్నం 12గంటల 50 నిమిషాల నుంచి నవంబరు 12 ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట 53 నిమిషాల వరకూ ఉంది.
- అమావాస్య తిథి - నవంబర్ 12 ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట 54 నిమిషాల నుంచి నవంబర్ 13 సోమవారం మధ్యాహ్నం 2 గంటల 23 నిమిషాల వరకూ ఉంది.