Dead Body In Pieces : ఛత్తీస్‌గఢ్‌లోని జశ్‌పుర్ జిల్లాలో ఉన్న ఛురి జలపాతం సమీపంలో రెండు ప్లాస్టిక్ సంచుల్లో గుర్తుతెలియని వ్యక్తి శరీర భాగాలు కనిపించడం వల్ల ఒక్కసారిగా కలకలం రేగింది. సమచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. అసలేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛురి జలపాతం సమీపంలో నివాసం ఉంటున్న కొందరు వ్యక్తులు.. శనివారం ఉదయం వాకింగ్‌కు వెళ్లారు. అలా నడుస్తున్న క్రమంలో వారికి దుర్వాసన వచ్చింది. అనుమానం వచ్చిన వారు.. దగ్గరకు వెళ్లి చూశారు. అక్కడ రెండు ప్లాస్టిక్ సంచుల్లో చేతులు, కాళ్లు, తల తెగి ఉన్న మృతదేహం కనిపించింది. ఒక్కసారిగా భయపడ్డ వారంతా.. పోలీసులకు సమాచారం అందించారు.
గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. శరీర భాగాలు ఉన్న సంచులను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించేందుకు అంబికాపుర్ నుంచి ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని రప్పించారు. తొలుత బాధితుడిని హత్య చేసి.. మృతదేహాన్ని ఛిద్రం చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
'మృతదేహం తప్పిపోయిన ఆ యువకుడిదే!'
అయితే ఆ మృతదేహం.. నారాయణపుర్‌లోని బర్తోలి జార్‌గావ్ గ్రామానికి చెందిన రామచంద్రది అని పలువురు గ్రామస్థులు అనుమానిస్తున్నారు. నెలక్రితం అతడు అదృశ్యమయ్యాడని.. సోంక్యారీ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైనట్లు చెబుతున్నారు.
"ఛురి జలపాతం సమీపంలో లభ్యమైన మృతదేహం సోంక్యారీ ప్రాంతానికి చెందిన రామచంద్ర నగేసియాది అని ప్రాథమికంగా అనుమానిస్తున్నాం. దర్యాప్తు పూర్తయ్యే వరకు నిర్ధరించలేం. ఫోరెన్సిక్ విచారణ జరిపి నివేదిక వచ్చిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుంది" అని ఎస్డీఓపీ షేర్ బహదూర్ సింగ్ మీడియాకు తెలిపారు.
ఫ్లైఓవర్ పక్కనే కవర్లో శరీర భాగాలు..
ఇటీవలే దిల్లీలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. యమునా ఖాదర్ ప్రాంతంలోని గీతా కాలనీ ఫ్లైఓవర్ సమీపంలో మహిళ శరీర భాగాలను దిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్లైఓవర్ సమీపంలో పలు దిక్కుల్లో మహిళ శరీర భాగాలను గుర్తించారు. మహిళ వయస్సు 35-40 ఏళ్ల మధ్య ఉంటుందని ప్రాథమికంగా నిర్ధరించారు. ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.