రాజస్థాన్లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని ప్రేమించినందుకు దళిత యువకుడిని కొంతమంది కర్రలతో కొట్టి చంపారు. రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో అక్టోబర్ 7న ఈ ఘటన జరిగింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
యువకుడు ప్రాణాలుపోయేవరకు కర్రలతో కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి నిందితులు వీడియోను కూడా చిత్రీకరించినట్లు పేర్కొన్నారు. అనంతరం యువకుడి మృతదేహాన్ని అతని నివాసం బయట పడేసినట్లు చెప్పారు.
ఈ ఘటనపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంపై ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దీనిపై మాట్లాడాల్సిన అవసరం ఉందని అన్నారు.
"రాహుల్జీ.. లఖింపుర్ ఘటన గురించి మీరు బాధపడకండి. ఆ విషయాన్ని.. యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ చూసుకుంటారు. మీరు అధికారంలో ఉన్న రాజస్థాన్‌లోని ప్రేమ్పురాలో దళిత యువకుడిని హత్య చేశారు. దీని గురించి ముఖ్యమంత్రి గెహ్లోత్ మాట్లాడాలి. కనీసం మాట్లాడే ధైర్యమైనా చేయండి. ఇలా చేయడం వల్ల ఎవరు నిజాయితీపరులో ప్రజలు తెలుసుకుంటారు."
-గజేంద్ర షెకావత్, కేంద్ర మంత్రి
ఈ ఘటనకు సంబంధించి.. నిందితులను పోలీసులు పట్టుకోవాలని కోరుతూ.. బాధిత కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన తరువాత అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
ఇదీ చూడండి: '3వేల కిలోల డ్రగ్స్' కేసులో కీలక పత్రాలు స్వాధీనం