Kerala CPM Love Jihad: కేరళ కోజికోడ్‌లో ఓ ప్రేమపెళ్లి వ్యవహారం రాజకీయ దుమారానికి దారి తీసింది. సీపీఎం యువజన విభాగమైన డీవైఎఫ్ఐ నాయకుడు షిజిన్.. వేరొక మతానికి చెందిన జ్యోస్న మేరీ జోసెఫ్‌ను ప్రేమపెళ్లి చేసుకున్నాడు. ఈనెల 10న జ్యోస్న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. ఇది లవ్‌జిహాద్ అని ఆరోపించారు. అనంతరం పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
అయితే జ్యోస్న సామాజిక మాధ్యమాల వేదికగా వీడియో పోస్టు చేసింది. తాను స్వచ్ఛందంగానే ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు చెప్పింది. కానీ బంధువులు మాత్రం ఆమెపై ఒత్తిడి చేయడం వల్లే అలా చెబుతోందని వాదించారు. సీపీఎం నాయకులు షిజిన్కు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. జ్యోస్న తండ్రి తమ కూతుర్ని హైకోర్టు ముందు హాజరుపరచాలని హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీంతో ఇద్దరినీ కోర్టు పిలిపించింది. న్యాయస్థానం ఎదుట హాజరైన జ్యోస్న.. తాను తల్లిదండ్రుల వద్దకు వెళ్లడానికి సిద్ధంగా లేనని చెప్పింది. అనంతరం కోర్టు యువజంటను విడుదల చేసింది.
Kerala CPM Controversy: కానీ ఈ వ్యవహారంపై సీపీఎం కోజికోడ్ జిల్లా కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జార్జ్ ఎం థామస్ మంగళవారం చేసిన వ్యాఖ్యలు వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. షిజిన్ జ్యోస్నను పెళ్లి చేసుకున్న తీరు ఆమోదయోగ్యంగా లేదని అన్నారు. ఈ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య మతసామర్యాన్ని దెబ్బతీసేలా ఉందని వ్యాఖ్యానించారు.
'లవ్ జిహాద్ అనేది నిజం. ఎస్డీపీఐ, జమాత్ ఇ ఇస్లామీ వంటి సంస్థలు బాగా చదువుకున్న ఇతర మతాల యువతులను ఓ మతం యువకులు ట్రాప్ చేసి లవ్ జిహాద్‌కు పాల్పడేలా ప్రోత్సహిస్తాయి. షిజిన్.. జ్యోస్నను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ముందే ఆ విషయాన్ని పార్టీకి తెలియజేయాల్సింది. దీని వల్ల ఈ ప్రాంతంలో పార్టీకి మద్దతుగా ఉండే వర్గం దూరమయ్యే పరిస్థితి వచ్చింది' అని అన్నారు థామస్. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపాయి. సీపీఎంపై విమర్శలు వెల్లువెత్తాయి. లవ్‌జిహాద్‌ను ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు సమాజాన్ని విడగొట్టేందుకు ప్రచారాస్త్రంగా ఉపయోగిస్తాయని చెప్పే సీపీఎంకు చెందిన నాయకుడే.. ఇప్పుడు వాటికి బలం చేకూర్చేలా మాట్లాడటం పార్టీని ఇరకాటంలో పడేసింది.
Kerala Love Marriage Controversy: ఈ పరిణామాలతో సీపీఎం దిద్దుబాటు చర్యలకు దిగింది. పెళ్లి అనేది ఇద్దరి వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత విషయమని, కుల, మత బేధాలు లేకుండా ఎవరు ఎవరినైనా వివాహం చేసుకునే హక్కు ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.మోహనన్ తెలిపారు. షిజిన్, జ్యోస్న పెళ్లి లవ్‌జిహాద్ కానే కాదని స్పష్టం చేశారు. థామస్ నోరుజారి పొరపాటుగా మాట్లాడి ఉంటారని చెప్పుకొచ్చారు. దీంతో థామస్ కూడా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. తన ఉద్దేశాన్ని తప్పుగా చిత్రీకరించారని పేర్కొన్నారు.
Kerala Love Jihad News: తమ పెళ్లిపై వివాదం చెలరేగుతున్న సమయంలో షిజిన్, జ్యోస్న జంట అలప్పుజలో మీడియాతో మాట్లాడింది. తమది లవ్‌జిహాద్ కానే కాదని స్పష్టం చేసింది. జీవితాంతం తాను తన మతంలోనే కొనసాగుతానని, షిజిన్ ఇందుకు ఎలాంటి అభ్యంతరం తెలపలేదని జ్యోస్న వివరణ ఇచ్చింది. ఆ స్వేచ్ఛ తనకు ఉందని చెప్పింది. అయితే ఇంత జరిగినా వివాదం సద్దుమణగకపోవడం వల్ల సీపీఎం జిల్లావ్యాప్తంగా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తోంది.
ఇదీ చదవండి: ఆ పనికి అడ్డొస్తున్నాడని.. మూడేళ్ల చిన్నారిని హత్యచేసిన తల్లి