CID Chief Pressmeet Ignoring Court Orders Against Margadarshi: తెలంగాణ హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. ఏపీ సీఐడీ విభాగాధిపతి సంజయ్, సీఐడీ ఎస్పీ ఫక్కీరప్ప గురువారం ప్రెస్‌మీట్ నిర్వహించి మార్గదర్శిపై నిరాధార ఆరోపణలు గుప్పించారు. చందాదారుల్లో అపోహలు సృష్టించేందుకు సీఐడీ చేసిన ఆరోపణలకు సంబంధించిన వాస్తవాలను మార్గదర్శి చిట్‌ఫండ్ పత్రికా ప్రకటన రూపంలో విడుదల చేసింది.
ఆరోపణ 1.. చిట్ ప్రారంభమైన తర్వాత మొదట వేలంపాట నిర్వహించకుండానే.. నాలుగైదు నెలలు వాయిదాలు కట్టించుకుంటున్నారు. మేనేజర్లు, ఏజెంట్ల ప్రమేయంతో ఇలా ముందుగా వాయిదాలు కట్టించుకుంటున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే... చందాదారులు వారంతటే వారే ముందస్తుగా కడుతున్నారని, వాటిని తాము బ్యాలెన్స్‌షీట్‌లో చూపిస్తున్నామని మార్గదర్శి చెబుతోంది.
వాస్తవం.. ఈ ఆరోపణల్ని మార్గదర్శి నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ప్రీవియస్ శాంక్షన్ ఆర్డర్-పీఎస్వో(PSO) పొందాకే చందాదారులను నమోదు చేసుకుంటున్నట్లు పునరుద్ఘాటించింది. వేలం కంటే ముందుచందాదారు తన సొంత విచక్షణ మేరకు చందా సొమ్ము కట్టుకోవచ్చని స్పష్టం చేసింది. నిర్దేశిత వాయిదా మొత్తం కంటే అదనంగా కట్టాలని మార్గదర్శి ఏ చందాదారునూ కోరదని చందాదారులు వారి సౌలభ్యం రీత్యా ముందుగానే కడితే వాటిని బ్యాలెన్స్‌షీట్‌లో అప్పుల కింద అడ్వాన్సు చందాల రూపంలో ప్రత్యేకంగా చూపిస్తున్నట్లు వెల్లడించింది.
ఆరోపణ 2.. ఒక్కో చిట్ గ్రూపులో 40-50 శాతం మనుషులే లేరు. వాటిని మార్గదర్శే నడిపిస్తోంది. ఆ సంస్థే చిట్ కడుతున్నట్లు, సంస్థే చిట్ పాడుకుంటున్నట్లు, సంస్థకే ప్రైజ్‌మనీ వచ్చినట్లు చూపించారు. వేకెంట్ చిట్స్ గురించి మేం అడుగుతుంటే వాటిని కంపెనీ తర్వాత నింపుకొంటుంది, తమ దగ్గర తగిన నగదు నిల్వలు ఉన్నాయని చెబుతున్నారు.
వాస్తవం.. ఈ ఆరోపణ ప్రజల్ని తప్పుదారి పట్టించడమేనని మార్గదర్శి తెలిపింది. ఒక చిట్‌గ్రూప్‌లో కంపెనీ విధిగా కలిగి ఉండే చిట్‌తో పాటు ఖాళీగా ఉన్న చిట్‌లకు కూడా తాత్కాలికంగా, స్వల్పకాలంపాటు సబ్‌స్క్రైబ్ చేస్తుందని పేర్కొంది. తర్వాత ఖాతాదారులెవరికైనా ఆ ఖాళీగా ఉన్న చిట్‌లను కేటాయించినప్పుడు అప్పటి వరకు కంపెనీ చెల్లించిన డబ్బును వారి నుంచి వసూలు చేస్తుందని వివరించింది. దీనికి అవసరమైన నగదు నిల్వల్ని కంపెనీ ఎప్పుడూ సిద్ధంగా ఉంచుతుందని స్పష్టం చేసింది. కంపెనీ కలిగి ఉన్న ఖాళీ చిట్‌లను చిట్ గ్రూప్ మొదలైన రెండు, మూడో నెలల్లోనే కొత్త ఖాతాదారులకు కేటాయిస్తుందని ఏ ఖాతాదారైనా మధ్యలో వైదొలగడం వల్ల ఖాళీ అయిన చిట్‌ను కంపెనీ కలిగి ఉన్నా ఆ చిట్‌గ్రూప్‌లోని ఖాతాదారులందరికీ ప్రైజ్‌మనీ అందేవరకూ కంపెనీ వేలంలో పాల్గొనదని స్పష్టం చేసింది. చిట్ గడువు ముగిశాకే ఖాళీ చిట్‌ల ప్రైజ్ అమౌంట్‌ని కంపెనీ డ్రా చేసుకుంటుందని వెల్లడించింది. 2022 మార్చి 31 నాటికి కంపెనీలో 15 వందల 9 కోట్ల నిల్వలుండగా వాటిని ఖాళీ చిట్‌లలో సబ్‌స్క్రైబ్ చేయడం సహా, వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నట్లు మార్గదర్శి తెలిపింది.
Malicious raid by CID on Margadarshi Chit Fund Pvt.. ఆరోపణ 3.. మార్గదర్శిలో ప్రస్తుతం 1,900-2000 చిట్ గ్రూపులు నడుస్తున్నాయి. ప్రతి చిట్ గ్రూపులోనూ ఒకరిద్దరు ఘోస్ట్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. మొత్తంగా 3 వేల మంది ఘోస్ట్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. తమ పేరిట చిట్ ఉన్నట్లు వారికి తెలీదు. వారికి, కంపెనీకి మధ్య ఎలాంటి లావాదేవీలు లేవు. వారి పేరుతో ఓచర్లపై ఎవరో సంతకం చేసి వాటిని అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్‌కు సమర్పిస్తున్నారు. వారి పేరిట చెక్కు సిద్ధం చేస్తున్నారు. లెడ్జర్ ఎంట్రీల్లో చెక్కు నంబరు, పేరు, తేదీ ఉండట్లేదు. ఆ చెక్కు కంపెనీ దగ్గరే ఉంటోంది. ఘోస్ట్ సబ్‌స్క్రైబర్ల వివరాలను కంపెనీ వాడుకుంటోంది. మేం 100 మంది ఘోస్ట్ సబ్‌స్క్రైబర్ల వివరాలను అధ్యయనం చేశాం. వారిలో కనీసం 23 మందికి శైలజా కిరణ్, ఆమె పీఏ నుంచి ఫోన్లు వెళ్లాయి. ఇది దర్యాప్తును అడ్డుకోవటం కాదా?
వాస్తవం.. పెద్దసంఖ్యలో ఖాళీ చిట్‌లకు కంపెనీనే సబ్‌స్క్రైబ్ చేస్తోందని చెప్పిన నోటితోనే ఘోస్ట్ సబ్‌స్క్రైబర్‌లను ఎన్‌రోల్ చేస్తున్నారంటూ పరస్పర విరుద్ధ ఆరోపణలు చేయడం సీఐడీ దురుద్దేశాలకు నిదర్శనమని మార్గదర్శి ఆక్షేపించింది. మార్గదర్శిలోని ఏ బ్రాంచ్‌లోనూ ఘోస్ట్ సబ్‌స్క్రైబర్లు లేరని కుండబద్ధలుకొట్టింది. ఏ ఖాతాదారుకైనా చెల్లించని ప్రైజ్‌మనీని చిట్‌ఫండ్స్ చట్టంలోని 22(2) సెక్షన్ ప్రకారం ప్రత్యేక బ్యాంకు ఖాతాలో కంపెనీ జమ చేస్తుందని ఆ డబ్బును ఆ ఖాతాదారు చెల్లించాల్సిన బకాయిల్ని ఆరు నెలలకోసారి సర్దుబాటు చేసేందుకే కంపెనీ వినియోగించే వీలుంటుందని గుర్తుచేసింది. చట్టప్రకారం కంపెనీకి.. ఆ అధికారం ఉందని ఘోస్ట్ సబ్‌స్క్రైబర్లకు కంపెనీ ఎండీ కార్యాలయం నుంచి ఫోన్లు చేశారన్నది సీఐడీ నిరాధార ఊహాజనిత ఆరోపణని ఆక్షేపించింది. వాయిదాలు చెల్లించాలని, ప్రైజ్‌మనీ తీసుకోవాలని గుర్తుచేసేందుకు కంపెనీ నిరంతరం ఖాతాదారులకు ఫోన్లు చేస్తుంటుంది, కేసును సంచలనం చేసేందుకే సీఐడీ బెదిరింపు ఎత్తుగడలు వేస్తోందని దుయ్యబట్టింది.
ఆరోపణ 4.. తనకు మార్గదర్శితో సంబంధం లేకపోయినా తన పేరు, వివరాలను దుర్వినియోగం చేసి తన పేరిట మార్గదర్శిలో చిట్ నడిపిస్తున్నారంటూ విశాఖపట్నానికి చెందిన లలితకుమారి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా విశాఖపట్నం రెండో పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో ఐపీసీ 419, 420, 467, 471, 409, 120బీ రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదైంది. బ్రాంచ్ మేనేజర్, ఏజెంట్‌పై కేసు నమోదుచేశాం. చిట్ వివరాలు సేకరించే క్రమంలో ఆమెకు ఫోన్ చేయగా.. తన పేరు దుర్వినియోగం అవుతోందని చెప్పారు.
వాస్తవం.. సీఐడీ చెప్పిన పి.లలితకుమారి విశాఖపట్నం మార్గదర్శి బ్రాంచిలో ఖాతాదారుగా చేరారు. 3వాయిదాలు చెల్లించాక 2019 అక్టోబరులో ఆమె చీటీ పాడుకున్నారు. తర్వాత ష్యూరిటీలు సమర్పించలేదు. చీటీ పాడుకున్న మొత్తం తీసుకోవాలంటూ.. ఎప్పటికప్పుడు బ్రాంచ్ నుంచి వర్తమానం పంపినట్లు మార్గదర్శి తెలిపింది. 2019 నవంబరులోనే ఆమె చీటీ పాడుకున్న మొత్తాన్ని చిట్‌ఫండ్ చట్టంలోని సెక్షన్ 22(2) ప్రకారం ప్రత్యేక ఖాతాకు బదలాయించామని తర్వాత ఆ మొత్తాన్ని ఆమె చెల్లించాల్సిన ఆరు నెలలకు సంబంధించిన వాయిదాల మొత్తం కింద సర్దుబాటు చేశామని తెలిపింది. ఖాతాదారుతో ముందే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ సర్దుబాటు చేశాం. వాయిదాలు చెల్లించని ఖాతాదారులను సంప్రదించి, వారితో ఫిర్యాదులు చేయించి సంస్థను అప్రతిష్ఠపాలు చేయడం ఏపీ సీఐడీకి అలవాటుగామారిందని మార్గదర్శి తప్పుపట్టింది.
ఆరోపణ 5.. విజయవాడకు చెందిన గొండు అన్నపూర్ణాదేవి ప్రభుత్వ వెటర్నరీ వైద్యుడి భార్య. ఆమెతో 8-10 ఏళ్లలో రూ.14 కోట్ల విలువైన 65 చిట్లకు సంబంధించి రూ.8 కోట్లు కట్టించుకుని రూ.48 లక్షలు మాత్రమే చెల్లించారు. వీటిలో 45 చిట్లు అధ్యయనం చేస్తే ఆమె రూ.7 కోట్లు కట్టగా.. రూ.8 వేలే వచ్చాయి. మార్గదర్శి సంస్థకు ఇంకా రూ.1.7 కోట్లు కడితే తప్ప అకౌంట్ క్లోజ్ అవ్వదంటూ బ్రాంచ్ మేనేజర్లు, బోర్డు సభ్యులు ఆమెపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అన్నపూర్ణాదేవి కుమార్తె ప్రియాంక విదేశాల్లో ఉంటారు. ఆమె సంతకం ఫోర్జరీ చేసి.. ఆమె 18 గ్రూపుల్లో చందాదారుగా నమోదైనట్లు, పాట పాడినట్లు చూపించారు. అన్నపూర్ణాదేవి ఫిర్యాదు ఆధారంగా మంగళగిరిలోని సీఐడీ పోలీసుస్టేషన్‌లో ఐసీసీలోని 120బీ, 420, 463, 464, 467, 471, 409, 506 రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదైంది. (అన్నపూర్ణాదేవితో కూడా మాట్లాడించారు. ఆమె కూడా ఇవే ఆరోపణలు చేశారు)
వాస్తవం.. సీఐడీ అధికారులు మీడియాతో మాట్లాడించిన అన్నపూర్ణాదేవి మార్గదర్శిలో చందాదారుతోపాటు ఏజెంటుగానూ ఉన్నారని కంపెనీ తెలిపింది. అన్నపూర్ణాదేవి ఏజెంటుగా ఉంటూ..తన కుమార్తె సహా ఇతర కుటుంబసభ్యులను చందాదారులుగా చేర్పించి ఏజెంట్ కమీషన్ కూడా పొందారు. పౌల్ట్రీ వ్యాపారంలో నష్టపోయినప్పటి నుంచీ.. ఆమె ఎగవేతదారుగా మారారు. భారీగా బకాయిపడ్డారు. ఈ నేపథ్యంలో చిట్ గ్రూపుల్లోని ఇతర చందాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం బకాయిల రికవరీకి వీలుగా ఫోర్‌మెన్ దావా దాఖలు ప్రక్రియ ప్రారంభించారు. డిఫాల్టర్‌గా మారినట్లు స్వయంగా ఒప్పుకున్న అన్నపూర్ణాదేవి ఇప్పుడు సీఐడీ ప్రోద్బలంతో ఆమె కుమార్తె సంతకం ఫోర్జరీ చేశారంటూ అసత్య ఆరోపణలు చేశారు. ష్యూరిటీల గురించి విలేకరులు ప్రశ్నిస్తే.. సీఐడీ విభాగాధిపతి ఇలా సమాధానం దాటవేశారు.
Bail Granted to Chirala Margadarsi Branch Manager: చీరాల ‘మార్గదర్శి’ మేనేజర్‌కు బెయిల్
CID Continues Malicious Attack on Margadarshi: ఆరోపణ 6.. కనీసం ఇద్దరు చందాదారుల సమక్షంలో చిట్ వేలం జరగాలి. కానీ అలా జరగట్లేదు. నరసరావుపేటలో ఏజెంట్ సంతకాన్ని బ్రాంచ్ మేనేజర్ ఫోర్జరీకి పాల్పడి మోసం చేశారు.
వాస్తవం.. ఈ ఆరోపణనూ మార్గదర్శి ఖండించింది. చీటీపాట నిర్వహించే క్రమంలో ఖాతాదారులు వ్యక్తిగతంగా రాలేకపోతూ బిడ్ ఆథరైజేషన్ సమర్పించినప్పుడు ఫోర్‌మెన్ వేలం పాటలో పాల్గొంటారు. లేనిపక్షంలో వేలం పాటలు పెద్ద మొత్తంలో నిర్వహించి చట్ట ప్రకారం ఎవరు పాడుకుంటే వారికే బిడ్ కేటాయిస్తారు. ఒకవేళ ఒక ఖాతాదారే బిడ్‌లో పాల్గొనాలనే ఆకాంక్ష వ్యక్తం చేస్తే అతనికే ఆ బిడ్ దక్కుతుంది. వేలం పాట నిర్వహించినప్పుడు మినిట్స్ సంబంధిత సబ్ రిజిస్ట్రార్‌కు సమర్పిస్తామని మార్గదర్శి తెలిపింది.
ఆరోపణ 7.. రూ.కోటి కంటే ఎక్కువ విలువ కలిగిన చిట్ గ్రూపుల్లో ఎవరైనా ఒకటి, రెండు చిట్లు వేసుకోవటం సహజం. కానీ ఓ రైస్‌మిల్లు పేరిట 42 టికెట్లు, ఆగ్రోఫుడ్స్ పేరిట 43 టికెట్లు, బిల్డర్ పేరిట 50 టికెట్లు ఇలా ఉన్నాయి. ఇలాంటివారు 800 మంది వరకూ ఉన్నారు. వీరిది ప్రకటిత ఆదాయమా? అప్రకటిత ఆదాయమా? అనేది పరిశీలించాలి. వారికి సీఆర్‌పీసీ 160 కింద నోటీసిచ్చి పిలిపించి ప్రశ్నిస్తున్నాం. వీటిపై ఆదాయపన్ను విభాగానికి లేఖ రాశాం. ప్రైవేటు కంపెనీలు ఇన్నిన్ని చిట్లు ఎలా వేశారనేది తేలాల్సి ఉంది. మార్గదర్శి చందాదారులను ఉచ్చులోకి లాగుతూ చిట్ గ్రూపుల్లో చేర్చుకుంటోంది.
వాస్తవం.. సంచలనాల కోసమే సీఐడీ ఈ తరహా ఆరోపణలు చేస్తోందని మార్గదర్శి ఆక్షేపించింది. ఆర్థిక పరిస్థితి, చెల్లింపు సామర్థ్యం, వారి ఆస్తుల మదింపు చేశాకే.. ఖాతాదారులుగా చేర్చుకుంటారని చీటీ సొమ్ము చెల్లించే ముందు కూడా వారి ఆర్థిక బలాన్ని మరోసారి మందిపు చేస్తామని మార్గదర్శి తెలిపింది. చీటీ పాట చెల్లించే క్రమంలో ఖాతాదారులు సమర్పించే ష్యూరిటీల విషయంలో రాజీ పడలేదని స్పష్టం చేసింది. ఒకవేళ వారు చెల్లింపుల్లో విఫలమైతే వారు సమర్పించిన సెక్యూరిటీలను చట్టప్రకారం నగదుగా మార్చుకోవచ్చనే విషయాన్ని కంపెనీ గుర్తు చేసింది. మార్గదర్శి చట్టబద్ధ కార‌్యకలాపాల వల్లే ఏటా లక్ష మందికి పైగా ఖాతాదారులు మళ్లీ మళ్లీ చీటీ పాటల్లో చేరుతున్నారు తప్ప సీఐడీ ఆరోపించినట్లు ఇందులో ఎలాంటి మతలబులు ఉండవని తెలిపింది.