Chandrababu Naidu judicial remand extended: చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు 2 వారాలపాటు పొడిగించింది. చంద్రబాబును వర్చువల్‌గా జడ్జి ఎదుట పోలీసులు హాజరుపరచగా.. జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించాలని సీఐడీ మెమో దాఖలు చేసింది. ఈనెల 19 వరకూ.. చంద్రబాబుకు జ్యుడీషియల్ రిమాండ్ ను న్యాయస్థానం పొడిగించింది. చంద్రబాబు బెయిల్, CID కస్టడీ పిటిషన్లపై విచారణ మరో రోజుకు వాయిదా పడింది. ఇవాళ విజయవాడలోని ACB కోర్డులో వరుసగా రెండోరోజూ.. వాదనలు హోరాహోరీగా సాగాయి. CID తరఫున వాదనలు వినిపించిన అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి... స్కిల్ డెవలప్ మెంట్ ఒప్పందంలో అక్రమాలు జరిగాయని, ఆ తప్పిదాలకు చంద్రబాబే బాధ్యుడని పేర్కొన్నారు. బ్యాంకు లావాదేవీలపై చంద్రబాబును ఇంకా విచారించాల్సి ఉందన్నారు. కస్టడీకి తీసుకుని మరిన్ని విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రమోద్ కుమార్ దూబే: పొన్నవోలు వాదనలను చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే తోసిపుచ్చారు. చంద్రబాబు సీఎం హోదాలో నిధులు మాత్రమే మంజూరు చేశారని, ఒప్పందం ప్రకారం 40 సెంటర్లను ఏర్పాటు చేశారని దూబే వివరించారు. అంతా ఓపెన్‌గానే జరిగిందని, ఇందులో కుంభకోణం ఎక్కడుందని ప్రశ్నించారు. ఇందులో చంద్రబాబు పాత్ర ఏముందని నిలదీశారు. చంద్రబాబు అవినీతి చేసినట్లు ఆధారాలు కూడా చూపించలేదన్న దూబే.. ఇది పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసని స్పష్టం చేశారు. CID కస్టడీలో చంద్రబాబు విచారణకు సహకరించారని, విచారణ సాగదీయడానికే మరోసారి కస్టడీ పిటిషన్ వేశారని దూబే పేర్కొన్నారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణను... శుక్రవారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు.
ఫైబర్ నెట్ కేసులో వాదనలు వినిపించిన సిద్ధార్థ అగర్వాల్: ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ అగర్వాల్ వాదనలు వినిపించగా... ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలకు చంద్రబాబును ఎలా బాధ్యుడిని చేస్తారని సిద్ధార్థ అగర్వాల్ ప్రశ్నించారు. కేవలం రాజకీయ కక్షతో మాత్రమే కేసు నమోదు చేశారని కోర్టు దృష్టకి తీసుకువచ్చారు. రెండేళ్ల క్రితం కేసు పెట్టి చంద్రబాబుకు నోటీసులు ఇవ్వలేదని.. ఈ కేసులో హఠాత్తుగా చంద్రబాబు పేరు చేర్చారని, ఆయన తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు.
ఏజీ శ్రీరామ్: పూర్తిస్థాయిలో విచారణ చేశాక చంద్రబాబు ప్రమేయం గుర్తించామని, ఏజీ శ్రీరామ్ కోర్టులో వాదనలు వినిపించారు. ప్రాథమిక విచారణలో చంద్రబాబు పేరు లేదు కాబట్టి కేసులో లేరనడం సరికాదని తెలిపారు. చంద్రబాబు ప్రమేయం గుర్తించినందునే కేసులో ఆయన పేరు చేర్చినట్లు ఏజీ తెలిపారు. టెరాసాఫ్ట్‌కు పనులు ఇవ్వడం మొదలు అన్నీ చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగాయని ఆరోపించారు. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని ఏజీ శ్రీరామ్ కోర్టును కోరారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.