కేరళ ప్రభుత్వం సామాన్యులకు షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరను లీటరుకు రూ.2 పెంచుతున్నట్లు ప్రకటించింది. శుక్రవారం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సమయంలో ఆర్థిక మంత్రి కేఎన్ వేణుగోపాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. సోషల్ సెక్యూరిటీ సీడ్ ఫండ్‌కు రూ.750 కోట్ల అదనపు ఆదాయాన్ని రాబట్టడమే లక్ష్యంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై సెస్ విధిస్తున్నట్లు తెలిపారు.
వ్యక్తిగత వినియోగం కోసం కొత్తగా కొనుగోలు చేసిన కార్లు, ప్రైవేట్ సర్వీస్ వాహనాలపై ట్యాక్స్ పెంచనున్నట్లు ఆయన ప్రకటించారు. ఎలక్ట్రిక్ మోటార్ క్యాబ్‌లపై వన్-టైమ్ ట్యాక్స్‌ను 5 శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. విళింజం ఓడరేవు చుట్టూ ఉన్న ప్రాంతంలో విస్తృతమైన పారిశ్రామిక, వాణిజ్య కేంద్ర అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. భూమి న్యాయపరమైన విలువను 20 శాతం పెంచనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో రబ్బరు సబ్సిడీకి రూ.600 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. వృద్ధి, శ్రేయస్సు పథంలోకి కేరళ తిరిగి వచ్చిందని ఆర్థిక మంత్రి తెలిపారు. కొవిడ్ సవాళ్లను కేరళ ధైర్యంగా అధిగమించిందని ఆయన అన్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు బడ్జెట్‌లో రూ.2000 కోట్లు కేటాయించారు. కానీ అదే సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం గమనార్హం.
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ కేరళ అప్పుల ఊబిలో కూరుకుపోలేదని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇతర దేశాల వలసలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆయన చెప్పారు. రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని టెక్నోపార్క్‌లో డిజిటల్ సైన్స్ పార్క్ ఏర్పాటు మే నాటికి పూర్తవుతుందని, ఈ ఏడాది కన్నూర్‌లో ఐటీ పార్కు నిర్మాణం ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. 'మేక్ ఇన్ కేరళ' కోసం రూ.1000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
'మద్యంపై సెస్.. డ్రగ్స్ వెపు ప్రజలు మొగ్గు చూపుతారు!'
కేరళ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కేఎన్ వేణుగోపాల్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రతిపక్షం మండిపడింది. పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధించడాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి తప్పుపట్టింది. పెరుగుతున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగా పోరాడుతున్న తరుణంలో పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధించడం సామాన్యులను ప్రభావితం చేస్తుందని ఆరోపించింది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దాచిపెట్టి ప్రజలపై వామపక్ష ప్రభుత్వం పన్నుల భారం మోపిందని ప్రతిపక్ష నేత వీడీ సీతశన్ విమర్శించారు. తగిన అధ్యయనం చేయకుండానే బడ్జెట్ ప్రవేశపెట్టారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న క్లిష్ట ఆర్థిక పరిస్థితిని ఈ బడ్జెట్ మరుగన పెడుతోందని ఆరోపణలు చేశారు. మద్యంపై సెస్ విధించడం వల్ల ఎక్కువ మంది డ్రగ్స్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని ఆయన అన్నారు.
గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రసంగంతో కేరళ శాసనసభా బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మార్చి 30 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి.