మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అవినీతి ఆరోపణలపై సీబీఐ నమోదు చేసిన కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చింది. అయితే, ఆయన జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని సీబీఐ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తీర్పు అమలును పది రోజులు వాయిదా వేయాలని బాంబే హైకోర్టును సీబీఐ కోరింది.
బార్లు, రెస్టారెంట్ల నుంచి ప్రతి నెల రూ.100కోట్లు వసూలు చేయాలని పోలీసు అధికారులపై దేశ్‌ముఖ్ ఒత్తిడి తెచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్నాయి. ముంబయి మాజీ సీపీ పరంబీర్ సింగ్ ఈ ఆరోపణలు చేయగా.. దీనిపై తొలుత సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఆయనపై చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఈడీ మనీలాండరింగ్ కేసులో ఆయనకు బెయిల్ లభించింది.
అయితే, సీబీఐ కేసులోనూ తనకు బెయిల్ ఇవ్వాలని దేశ్‌ముఖ్.. గత నెల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాన్ని ఆ కోర్టు కొట్టేయగా.. బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. తనకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయని కోర్టుకు విన్నవించారు. తాజాగా దేశ్‌ముఖ్ పిటిషన్‌పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ ఎంఎస్ కార్నిక్.. ఇరుపక్షాల వాదనలు ఆలకించి మాజీ మంత్రికి బెయిల్ ఇచ్చారు.