Bihar cabinet expansion: భాజపాతో తెగదెంపులు చేసుకొని విపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మంత్రివర్గాన్ని విస్తరించారు. ఈ విస్తరణలో కూటమిలో అత్యధిక సభ్యులు కలిగి ఉన్న ఆర్జేడీకి 16 మంత్రి పదవులు దక్కాయి. నితీశ్ పార్టీ నుంచి 11 మంది ప్రమాణ స్వీకారం చేయగా.. కాంగ్రెస్ నుంచి ఇద్దరు, హిందుస్థానీ ఆవామ్ మోర్చా నుంచి ఒకరు మంత్రివర్గంలో చేరారు. మొత్తంగా సుమారు 31 మంది మంత్రులుగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు.
2020 భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీయూ.. ఈ నెలలో కమలం పార్టీతో బంధాన్ని తెంచుకుంది. ఆర్జేడీ, ఇతర పార్టీలతో కూడిన కూటమితో జట్టుకట్టింది. ఎనిమిదో సారి నితీశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగా.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఈ మంత్రివర్గంలోకి తేజస్వి సోదరుడు తేజ్ ప్రతాప్ చేరారు. నీతీశ్ కుమార్ మునుపటి మంత్రులను దాదాపుగా కొనసాగించారు. అలాగే హోం శాఖను తన చెంతే ఉంచుకోగా.. ఉపముఖ్యమంత్రి తేజస్వీకి వైద్యం, పట్టణాభివృద్ధి శాఖను కేటాయించారు. బిహార్ కేబినెట్‌లో ముఖ్యమంత్రితో సహా 36 మంది సభ్యులకు స్థానం ఉంది. తదుపరి విస్తరణలో ఆ స్థానాలు నిండనున్నాయి.
ప్రస్తుత కేబినెట్‌లో ఐదుగురు ముస్లింలకు స్థానం ఇవ్వగా.. ఆర్జేడీ తమకు పట్టున్న యాదవ సామజిక వర్గానికి ఏడు మంత్రి పదవులను కేటాయించింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుత కూటమి బలం 163గా ఉంది. ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా నీతీశ్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం వల్ల ఆ సంఖ్య 164కు చేరింది. ఇక ఈ కొత్త ప్రభుత్వం ఆగస్టు 24న బలపరీక్షకు వెళ్లనుంది.
బిహార్‌పై దృష్టి సారించిన భాజపా: మరోవైపు బిహార్ రాజకీయాలపై భాజపా అధినాయకత్వం దృష్టి సారించింది. రాష్ట్ర భాజపా నాయకులతో మంగళవారం సమావేశమైంది కేంద్ర నాయకత్వం. ఈ సమావేశానికి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ సంస్థాగత కార్యదర్శి బీఎల్ సంతోశ్ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. భవిష్యత్తు ప్రణాళిక, 2024 లోక్‌సభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
ఇవీ చదవండి: ఇంట్లోకి దూసుకెళ్లిన ట్రక్కు, నలుగురు మృతి