కరోనా మహమ్మారిని అరికట్టడానికి విధించిన లాక్డౌన్ ఇప్పటికీ ఎందరినో హరిగోసలు పెడుతోంది. ఝార్ఖండ్లో కుటుంబాన్ని వదిలి ఉద్యోగ రీత్యా ముంబయికు వచ్చిన ఓ మహిళ ఇంటి అద్దె కట్టలేక, తిరిగి సొంతగూటికి వెళ్లే మార్గం లేక ఎనలేని తిప్పలు పడింది. ఆఖరికి తన స్కూటీపైనే 1800 కి.మీ ప్రయాణించి ఇల్లు చేరుకుంది.
ఝార్ఖండ్, జమ్షెద్ పుర్, కద్మాకు చెందిన సోనియా దాస్ ముంబయిలోని ఓ ప్రొడక్షన్ హౌస్లో పని చేస్తోంది. భర్త అభిషేక్ ఘోష్ గుండె సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో ఐదేళ్ల కుమారుడిని చూసుకుంటూ కద్మాలోనే ఉంటున్నాడు.
లాక్డౌన్ తో షూటింగ్స్ లేక సోనియా ఉపాధి కోల్పోయింది. ఆర్థికంగా పూర్తిగా చితికిపోయింది. అద్దె కట్టలేక ఇంటిని ఖాళీ చేసి, స్నేహితురాలు సబియా ఇంట్లో కొద్ది రోజులు ఆశ్రయం పొందింది. ఇంటికెళ్లిపోదామంటే డబ్బులు లేవు. దీంతో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ప్రముఖ నటుడు సోనూసూద్లను సాయం కోరుతూ ట్వీట్ చేసింది. కానీ, లాభం లేకపోయింది.
ఇక తన స్కూటీపైనే ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంది సోనియా. స్నేహితుల వద్ద రూ.5000 అప్పు తీసుకుంది. జులై 21న స్కూటీపై ఇంటికి బయల్దేరింది. దాదాపు 1800 కి.మీ ప్రయాణించి కద్మాకు చేరుకున్నాక.. బాధ్యతగా తనంతట తానే క్వారంటైన్ కేంద్రంలో చేరింది సోనియా.
ఇదీ చదవండి: పొలంబాటలో ఉపాధి వేట.. యువతకు అవకాశాల వెల్లువ