తమిళనాడు తూత్తుకుడి జిల్లాలో దారుణ హత్య జరిగింది. కొబ్బరికాయలు దొంగతనం చేశాడనే కారణంతో ఓ కళాశాల విద్యార్థిని నరికి చంపారు. తల, మొండెం వేరుచేసి అటవీ ప్రాంతంలో పడేశారు.
జిల్లాలోని తాలివాయివన్ వడాలి గ్రామానికి చెందిన సత్యమూర్తి(21) అనే యువకుడు మే 29న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. కానీ, ఎంతసేపటికీ తిరిగిరాకపోవటం వల్ల అతని కోసం వెతకటం ప్రారంభించారు కుటుంబసభ్యులు. ఈ క్రమంలో సమీపంలోని అటవీ ప్రాంతంలో రక్తపుమడుగులో తల లేకుండా ఉన్న సత్యమూర్తి మృతదేహాన్ని గుర్తించారు.
సమాచారం అందుకున్న ఆర్థూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడి తల కోసం గాలింపు చేపట్టారు. 3 గంటలైనా ఫలితం లేకపోవటం వల్ల తల లేకుండానే మృతదేహాన్ని శవపరీక్షకు తరలించాలని నిర్ణయించారు. కానీ, దానికి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు నిరాకరించారు. ఘటనాస్థలం వద్దే నిరసన చేపట్టారు. జిల్లా ఎస్పీ బాలగోపాలన్, డీఐజీ ప్రవీణ్ కుమార్ గ్రామస్థులకు నచ్చజెప్పి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. ఆ తర్వాత కొద్ది సమయానికి సుమారు 400 మీటర్ల దూరంలో పొదళ్లలో సత్యమూర్తి తల దొరికింది.
గొడవతో..
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. సత్యమూర్తి తన ఇద్దరు మిత్రులతో కలిసి సమీప గ్రామంలో కొబ్బరి తోటలోకి అక్రమంగా ప్రవేశించాడు. కొబ్బరిబోండాలను దొంగిలించే క్రమంలో ప్రత్యక్షంగా పట్టుకున్నారు భద్రత సిబ్బంది. వారిని చెట్టుకు కట్టేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే ఇద్దరు స్నేహితులు క్షమాపణ చెప్పగా.. సత్యమూర్తి మాత్రం కులం పేరుతో దూషించాడు. అది వివాదానికి దారి తీసింది. ఇరు గ్రామాల యువకుల మధ్య గొడవ పెరిగి సత్యమూర్తిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేశారు.
గతంలో సత్యమూర్తిపై ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటి నిరోధక చట్టం) కింద రెండు కేసులు ఉన్నట్లు గుర్తించారు అధికారులు.