ప్రవహించే రక్తం రంగు అందరిలోనూ ఒకటే. ధర్మం కన్నా, ఐకమత్య భావన గొప్పది. ఉత్తర్ప్రదేశ్ షహరాన్‌పూర్‌లోని వందలాదిమంది ఈ మాటలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు. ఐకమత్య ఔన్నత్యాన్ని చాటిచెబుతారు. కలపతో కళాకృతులు తయారుచేసి, జీవనం సాగించే సామాన్యులు వాళ్లు. హిందూ ఆలయాలను అందంగా చెక్కే కళ వారి సొంతం. ఆ కళాకారుల్లో 90% ముస్లింలే.
శుక్రవారం, ఈద్ సమయాల్లో మతపర ప్రార్థనలు చేసే వీరంతా.. హిందూ మందిరాలు తయారుచేయడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. వీళ్లు తయారుచేసే కలప మందిరాలకు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది.
"షీషం, వేప కలపతో మందిరాలు తయారుచేస్తాం. దేశవ్యాప్తంగా వాటిని సరఫరా చేస్తాం. ఇక్కడి నుంచే కాక అమెరికా, ఇంగ్లండ్ నుంచి సైతం మాకు ఆర్డర్లు వస్తున్నాయి. మలేసియాకు కూడా ఈ పూజామందిరాలు పంపుతాం."
--మొహమ్మద్ ఇర్షాద్, ఫ్యాక్టరీ యజమాని.
15 ఏళ్ల వరకూ..
మంచి నైపుణ్యాలున్న ఈ కళాకారులంతా వేప, టేకు చెట్ల మొద్దుల నుంచి, సుందరమైన మందిర ఆకృతులు తీర్చిదిద్దుతారు. కొన్ని తరాలుగా ఈ కళను కొనసాగిస్తున్నారు. హిందూ మత ధార్మిక చిహ్నాలైన ఓం, స్వస్తిక్‌లనూ వాటిపై చెక్కుతారు. నాణ్యమైన కలప నుంచి తయారు చేయడం వల్ల 15 ఏళ్ల వరకూ చెక్కుచెదరవు.
మందిరాలను తయారుచేయడం వల్ల, నేరుగా ఆ భగవంతుడికే సేవ చేసిన భావన కలుగుతుందని తయారీ పరిశ్రమ యజమాని మొహమ్మద్ ఇర్షాద్ చెప్తున్నారు. ఎన్ని చిన్నచిన్న అవాంతరాలు తలెత్తినా, వాటన్నింటినీ అధిగమించి, తమ పని కొనసాగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈద్ రోజున నమాజు చదివే చేతులే దేవతల మందిరాలు తయారుచేస్తున్నాయి. మత విద్వేషాలు సృష్టించాలనుకునే వారికి, వీరి వృత్తే చెంపపెట్టు. సమాజంలోని మతాలు ఐకమత్యంగా ఉండాలి అన్న మత సామరస్యాన్ని ఈ ముస్లింల కళ చాటిచెప్తోంది.
ఎవరో నిజమే చెప్పారు..
మేం మంచే చేయాలనుకున్నాం, కానీ చెడే చేశాం.
కొందరు గుడి కట్టారు, మరికొందరు మసీదు నిర్మించారు,
మానవత్వం మరిచిపోయాం, పోట్లాడుకున్నాం,
మనుషులుగా మారాలనుకున్నాం, సరిహద్దులు గీసుకున్నాం.
ఇదీ చూడండి:రహదారిపై ఆటోడ్రైవర్ నిశబ్ద పోరాటం