కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన పాఠశాలలు నేటి నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. పాఠశాలల పునఃప్రారంభానికి అన్లాక్-4లో భాగంగా ఇవాళ నుంచి అనుమతులు ఇచ్చింది కేంద్రం. 9-12వ తరగతి విద్యార్థులు సెప్టెంబర్ 21 నుంచి స్వచ్ఛందంగా పాఠశాలలకు వెళ్లేందుకు అవకాశం కల్పించింది.
5 నెలల తర్వాత పాఠశాలలు తెరుచుకోనున్న నేపథ్యంలో రాష్ట్రాలు ఏర్పాట్లు చేశాయి. తల్లిదండ్రుల సమ్మతితో విద్యార్థులు పాఠశాలకు హాజరుకానున్నారు. లేదంటే ఆన్లైన్ తరగతులు వినేందుకు అవకాశం ఉంటుంది.
పాఠశాలలు ప్రారంభిస్తున్న క్రమంలో కరోనా విజృంభించే ప్రమాదం ఉందని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా పూర్తిగా కనుమరుగయ్యే వరకు పాఠశాలలు తెరవొద్దని పేర్కొంటున్నారు.
దిల్లీలో అక్టోబర్ 5 తర్వాతే..
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు నేటి నుంచి పాఠశాలలను తెరిచేందుకు సిద్ధమవుతున్నప్పటికీ.. దేశ రాజధాని దిల్లీలో మాత్రం అక్టోబర్ 5 వరకు స్కూళ్లు మూసే ఉంటాయి. కరోనా విజృంభిస్తున్న వేళ పాఠశాలలను తెరిచే అవకాశం లేదని దిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే.. ఆన్లైన్ తరగతులు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది. ఈ మేరకు ఆ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
సిలబస్ తగ్గింపు..
కరోనా నేపథ్యంలో.. ఈ విద్యాసంవత్సరంలో పాఠశాల విద్యార్థుల సిలబర్ను 40 శాతం తగ్గించనున్నట్లు స్పష్టం చేసింది తమిళనాడు. 18 మందితో ఏర్పాటు చేసిన ప్యానెల్ సూచనల మేరకు.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
మార్చి 16 నుంచి మూసివేత..
కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో మార్చి 16 నుంచి దేశ వ్యాప్తంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మూసివేశారు. అనంతరం మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. లాక్‌డౌన్ అనతంరం ఆన్లైన్ తరగతులు ప్రారంభించాయి ఆయా రాష్ట్రాలు. అన్లాక్-4లో మార్గదర్శకాల్లో భాగంగా పాఠశాలలు తెరిచేందుకు అనుమతిచ్చిన కేంద్రం.. గరిష్ఠంగా 50 శాతం మంది బోధన, బోధనేతర సిబ్బంది విధులకు హాజరయ్యేందుకు ఓకే చెప్పింది.
ఇదీ చూడండి: సగం మంది సిబ్బంది.. హాజరైతే చాలు!