రక్షా బంధన్ సందర్భంగా ఆధ్యాత్మిక గురువు మాతా అమృతానందమయి, ప్రముఖ గాయని లతా మంగేష్కర్లు ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. వారిరువురికీ కృతజ్ఞతలు తెలిపిన మోదీ.. దేశంలోని నారీమణుల ఆశీర్వచనాలు తనకు ఎంతో బలాన్ని చేకూరుస్తాయన్నారు.
దేశాన్ని ప్రగతిపథంలో నడిపేందుకు ప్రధాని మోదీకి.. దేవుడు సహకరించాలని కోరుతూ వీడియో సందేశాన్ని పంపారు అమృతానందమయి.
'ప్రస్తుతం దేశంలో అనేక సమస్యలున్నాయి. ఓవైపు దేశం సరిహద్దుల్లో పొరుగుదేశాల నుంచి ముప్పును ఎదుర్కొంటోంది. మరోవైపు ప్రజలు మహమ్మారిపై పోరాటం చేస్తున్నారు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ప్రధాని తీసుకునే నిర్ణయాలకు దేవుడు అండగా ఉండాలని కోరుతున్నాను.'
- అమృతానందమయి, ఆధ్యాత్మిత గురువు
దేశం కోసం ఆరాటపడుతున్న మోదీ కృషిని ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారు. ఆయనకు దేవుడు మరింత శక్తిని ప్రసాదించాలని ట్విట్టర్ ద్వారా వీడియో సందేశాన్ని పంపారు లతా మంగేష్కర్.
'రక్షాబంధన్ సందర్భంగా మీకు రాఖీ పంపలేకపోతున్నాను. దానికి కారణమేంటో అందరికీ తెలుసు. దేశంలో ఎంతోమంది మహిళలు రాఖీలతో సిద్ధంగా ఉన్నా.. పరిస్థితుల ప్రభావం కారణంగా మీ దగ్గరికి రాలేకపోతున్నారు. అయితే అందరి ఆశీర్వాదాలతో మీరు దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తారని నాకు హామీ ఇవ్వండి.'
- లతా మంగేష్కర్, గాయని
కోట్లాది మంది తల్లులు, సోదరీమణుల ఆశీర్వాదంతో దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందని ఈ సందర్భంగా వారివురికీ సమాధానమిచ్చారు మోదీ.
రక్షాబంధన్ వేడుకల్లో రాష్ట్రపతి
దేశంలోని వివిధ నర్సు సంఘాల ప్రతినిధులతో.. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు. కొవిడ్-19పై పోరాటంలో నర్సుల పాత్రను ప్రశంసించారు కోవింద్.
ఇదీ చదవండి: కరోనా కలిపిన హిందూ- ముస్లిం రక్షా బంధం!