కర్ణాటకలో రానున్న రెండు నెలల్లో కరోనా మరింత విజృంభించనుందన్నారు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు. మరో 15-30 రోజుల్లోనే కేసుల సంఖ్య రెండింతలు పెరిగే అవకాశముందని అంచనా వేశారు. అయితే అందులో భయపడాల్సిన పనేమీ లేదని, జాగ్రత్తలు పాటిస్తే.. ఎలాంటి ప్రమాదం ఉండబోదని ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు మంత్రి.
"రాష్ట్రంలో రోజుకు దాదాపు 2వేల కేసులు నమోదవుతున్నాయి. అందుకే గత గురువారం రాత్రి బెంగళూరులో ఏడు రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించాల్సి వచ్చింది. రానున్న రెండు నెలల్లో వైరస్ తీవ్రత మరింత పెరగనుంది. వచ్చే 15-30 రోజుల్లో కరోనా కేసులు రెండింతలయ్యే అవకాశముంది. ఇది ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారనుంది. "
-బి. శ్రీరాములు, కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి
ఒకే రోజు 2,798 కరోనా కేసులు నమోదైన తర్వాత.. జులై 14న రాజధాని బెంగళూరులో సంపూర్ణ లాక్డౌన్ విధించింది కర్ణాటక ప్రభుత్వం. జులై 22 వరకు కొనసాగనున్న ఈ లాక్డౌన్కు మాజీ మంత్రి, జేడీఎస్ నేత హెచ్ డీ కుమారస్వామి సైతం పూర్తి మద్దతు తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. లాక్డౌన్ అనివార్యమన్నారు.
కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే కేసుల సంఖ్య 36 వేలు దాటింది. వీరిలో 613 మంది మృతి చెందగా... 14,716 మంది కోలుకున్నారు.
ఇదీ చదవండి: మినీ లాక్డౌన్: కరోనా కట్టడికి రాష్ట్రాల నిర్ణయం