మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఓ సంఘటన కర్ణాటకలో జరిగింది. హిందూ దేవాలయం కోసం ఓ ముస్లిం వ్యక్తి రూ.80 లక్షల నుంచి రూ.కోటి విలువ చేసే భూమిని ఉచితంగా అందించారు.

హోసకోట్ తహసీల్ కదుగోడిలోని బెలాతుర్ కాలనీకి చెందిన హెచ్ఎమ్జీ బాషా.. తన 1633.63 చదరపు అడుగుల భూమిని వీరాంజనేయ స్వామి ఆలయ ట్రస్ట్‌కు ఉచితంగా అందించారు. ఈ ఆలయం.. బెంగళూరు నుంచి చెన్నైకు వెళ్లే జాతీయ రహదారి మధ్యలో ఉంది.
తనకు మందిరమైనా, మసీదు అయినా ఒకలాంటిదేనని చెబుతున్నారు బాషా.

"ఆంజనేయ మందిరంలో సరిపడినంత స్థలం లేక భక్తులు ఇబ్బంది పడుతూ ఉండటం నేను చూశాను. అందుకని నేను నా 1.5 గుంటల స్థలాన్ని ఆలయం కోసం ఉచితంగా ఇచ్చాను. నా కుటుంబ సభ్యులు కూడా ఇందుకు అంగీకరించారు. ఆ భూమి మీద యాజమాన్య హక్కులను నేను వీరాంజనేయ స్వామి ట్రస్ట్‌కు బదిలీ చేస్తాను. నాకు ఎలాంటి మతభేదాలు లేవు. ఈ గుడిలో భక్తులు 30 ఏళ్లకు పైనుంచి పూజలు చేస్తున్నారు. మసీదు కట్టినా, గుడి కట్టినా అంతా ఒకటే. ఇది సమాజానికి ఉపకరిస్తుందని నేను నమ్ముతున్నాను."
--హెచ్ఎమ్జీ బాషా
బాషా చేసిన సాయానికి అక్కడి జనమంతా ఎంతో మెచ్చుకుంటున్నారు. ఆయన మంచితనాన్ని తెలియజేస్తూ గ్రామస్థులు.. రహదారి పక్కన పోస్టర్లు ఏర్పాటు చేశారు.


ఈ భూవిరాళం అందడం ద్వారా రూ.కోటి వ్యయంతో ఆంజనేయ స్వామి ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టామని తెలిపారు ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు.
ఇదీ చూడండి:'కుతుబ్ మినార్'లోని ఆలయాలపై వివాదమేంటి?