భారత ప్రభుత్వం చేపట్టిన 'ఆయుష్మాన్ భారత్' వంటి పథకాలు అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటికీ ఆదర్శప్రాయమని ప్రధాని నరేంద్ర మోదీ ఐరాస వేదికపై స్పష్టం చేశారు.
సార్వత్రిక వైద్య సేవలపై తొలిసారిగా ఐక్యరాజ్యసమితిలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో మోదీ ప్రసంగించారు. నాలుగు స్తంభాల ఆధారంగా తమ దేశంలో ఆరోగ్య విధానాన్ని రూపొందిచామని మోదీ తెలిపారు.
"ప్రపంచ సంక్షేమం.. వ్యక్తి సంక్షేమంతో మొదలవుతుంది. ఈ విషయంలో మేము సమగ్రమైన అవగాహనతో నాలుగు స్తంభాల ఆధారంగా ముందుకు వెళ్తున్నాం. మొదటి స్తంభం.. రోగ నిరోధక చర్యలు చేపట్టడం. రెండవది.. అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవలను అభివృద్ధి చేయడం. ప్రపంచంలో అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్‌ను ప్రారంభించాం. మూడవ స్తంభం.. సరఫరాల్లో లోటు లేకుండా చూడటం. ఆరోగ్యమంటే కేవలం వ్యాధులు లేకపోవడం కాదు.. ఆరోగ్యకర జీవితాన్ని అనుభవించడం. ఇది ప్రజలందరి హక్కు. అందులో భాగంగానే ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం." - నరేంద్ర మోదీ, భారత ప్రధాని
వ్యాధుల నిరోధకానికి...
వ్యాధి నిరోధక చర్యల్లో భాగంగా ఆయుర్వేదం, యోగా, ఫిట్ ఇండియా ఉద్యమాలను ప్రోత్సహిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. వీటి ద్వారా జీవనశైలి వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, కుంగుబాటులను నియంత్రించవచ్చని చెప్పారు. పారిశుద్ధ్యంపై అవగాహన కలిగిస్తున్నామన్నారు. యువతకు హాని కలిగిస్తోన్న ఈ-సిగరెట్లను నిషేధించినట్లు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 1.25 లక్షల ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి టీకాలపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు.
వైద్యసేవలు...
వైద్యసేవలు భారం కాని రీతిలో అందరికీ అందుబాటులోకి తెస్తున్నామని మోదీ వివరించారు. 'ఆయుష్మాన్ భారత్' అందులో భాగమేనని, దీని ద్వారా 50 కోట్ల మంది పేదలకు లబ్ది కలుగుతోందని తెలిపారు. ఏటా ఉచితంగా రూ.5 లక్షలు విలువ చేసే వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. 5000 జన ఔషధ కేంద్రాలు నెలకొల్పి దాదాపు 800 రకాల జనరిక్ మందులను తక్కువ ధరకే అందిస్తున్నామన్నారు. తగినంత మంది వైద్యులను అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందుకే ఆధునిక, నాణ్యమైన ప్రమాణాలతో విరివిగా వైద్య కళాశాలలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
సేవా దృక్పథంతో కార్యక్రమాలు అమలు చేస్తున్నామనడానికి పౌష్టికాహార పథకాలే ఉదాహరణ అని చెప్పారు మోదీ. ఐరాస ప్రతిపాదించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా 2025 నాటికి క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలిస్తామన్నారు.
- ఇదీ చూడండి: మోదీ ప్రసంగం కోసం షెడ్యూల్ మార్చుకున్న ట్రంప్!