తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్రతను తెలిపే మరో వార్త బయటకువచ్చింది. సోమవారం రాత్రి జరిగిన ఈ హింసాత్మక ఘటనలో కల్నల్ సంతోష్ సహా 20 మంది భారత సైనికులు మరణించినట్టు ఓ మిలిటరీ అధికారి ఈటీవీ భారత్‌కు తెలిపారు. మరో 10మంది గల్లంతైనట్టు వివరించారు. అనేక మంది గాయపడినట్టు పేర్కొన్నారు. అయితే భారత సైన్యం 20 మంది జవాన్లు మృతి చెందినట్లు స్పష్టం చేసింది.
"సోమవారం.. భారత్‌వైపు ఉన్న వాస్తవాధీన రేఖలోకి చైనా సైనికులు ప్రవేశించి తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు. మన కమాండింగ్ ఆఫీసర్(సీఓ) నేతృత్వంలోని ఓ బృందం ఆ శిబిరాలను కూల్చివేసింది. చైనీయులు వెనుదిరిగారు అని ఆ బృందం భావించింది. కానీ హఠాత్తుగా 1000మంది చైనా సైనికులు ముందుకు వచ్చారు. భారత్‌వైపు కూడా 1000మంది జవాన్లు ఉన్నారు. నదీ ప్రాంతంలో ఈ ఘర్షణ తలెత్తడం వల్ల చాలా మంది సైనికులు నదిలో పడిపోయారు."
--- ఆర్మీ అధికారి.
ఇదే ఘటనలో చైనావైపు కూడా భారీ ప్రాణనష్టం కలిగినట్టు తెలుస్తోంది. భారత అధికారుల లెక్కల ప్రకారం చైనా వైపు మృతులు, గాయపడినవారు 43 మంది ఉంటారని అంచనా వేస్తున్నారు.