ఉత్తర్‌ప్రదేశ్‌లో పోలీసుల కాల్పుల్లో హతమైన కరుడుగట్టిన నేరస్థుడు వికాస్ దుబే కుటుంబసభ్యులు, అతని అనుయాయులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. మనీలాండరింగ్ కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. అక్రమ లావాదేవీలు, భారీగా కూడబెట్టిన ఆస్తులపై విచారణ జరపనుంది.
ఈ మేరకు లఖ్‌నవూలోని ఈడీ జోనల్ కార్యాలయం అధికారులు.. కాన్పుర్ పోలీసులకు ఓ లేఖ రాసినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. వికాస్ దుబేతోపాటు అతని అనుచరులపై నమోదైన ఎఫ్ఐఆర్లు, ఛార్జ్‌షీట్ల వివరాలతోపాటు ఆయా కేసులకు సంబంధించిన తాజా వివరాలు కోరినట్లు పేర్కొన్నాయి.
త్వరలో దర్యాప్తు..
మనీలాండరింగ్ చట్టం కింద త్వరలోనే కేసు నమోదు చేసి.. దుబే, అతని అనుచరులు, కుటుంబసభ్యులు నేరపూరిత కార్యకలాపాల ద్వారా వచ్చిన డబ్బుతో స్థిర, చరాస్తులు కొనుగోలు చేశారా అనే విషయాలపై దర్యాప్తు చేయనున్నట్లు ఈడీ అధికారులు చెప్పారు.
నేరపూరిత కార్యకలాపాల ద్వారా వికాస్ దుబే తనతోపాటు కుటుంబ సభ్యులు, బినామీల పేర్లతో పెద్దమొత్తంలో ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలున్నాయి.
ఇదీ చూడండి: 'నా భర్త తప్పు చేశాడు.. సరైన శిక్షే పడింది'