తమిళనాడు కోయంబత్తూర్లోని ఓ గ్రామంలో పామును ముక్కలుగా నరికి ఆలయం ముందున్న త్రిశూలానికి గుచ్చాడు ఓ తాగుబోతు. ఈ తతంగాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టగా.. వైరల్గా మారింది.
అలా చేయడానికి కారణమేంటి?
పొల్లాచి సమీపంలోని కుమారపలయం గ్రామంలో పురాతన పిడారి అమ్మన్ ఆలయం ఉంది. గురువారం సాయంత్రం ఓ తాగుబోతు పామును చంపి అక్కడకు తీసుకొచ్చాడు. ముక్కలుగా చేసి వాటిని గుడి ముందున్న శూలానికి గుచ్చాడు. ఆ తర్వాత వాటిపై పాలాభిషేకం చేసి వెళ్లిపోయాడు.
ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన కొందరు గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. అదే గ్రామానికి చెందిన వేలుచమి అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించారు. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ వ్యక్తి ఇలా చేయడానికి ఏదైనా కారణం ఉందా అన్న అంశంపై విచారిస్తున్నారు.