ఇతర రాష్ట్రాల్లోని వలస కార్మికులు సొంతూళ్లకు చేరుకునేందుకు జారీ చేసిన మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలు తప్పక పాటించాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. కార్మికుల ప్రయాణ ఏర్పాట్లకు సంబంధించి ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించాలని రాష్ట్రాలకు సూచించింది. ఆకలితో అలమటిస్తున్న తమను సొంతూళ్లకు పంపాలని దేశవ్యాప్తంగా కార్మికులు తీవ్ర ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం.
కేంద్రం మార్గదర్శకాలు..
- కార్మికులు, విద్యార్థులు, పర్యటకులు, భక్తులు సొంత రాష్ట్రాలకు చేరుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేయాలి
- బస్సుల ద్వారా మాత్రమే ప్రయాణం చేయాలి.
- ప్రతిఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహించి, ఎలాంటి లక్షణాలు లేవని వైద్యులు నిర్ధరించాకే అనుమతించాలి.
- బస్సుల్లో ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా చూడాలి. వాటిని శానిటైజర్లతో శుభ్రం చేయాలి.
- ప్రతిఒక్కరూ ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా ఉపయోగించాలి.
- సొంత రాష్ట్రాలకు చేరుకున్నాక అక్కడి అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించాలి.
- క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుంటే ఇళ్లకు పంపాలి. 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండేలా చూడాలి.
గూడ్స్ ట్రక్కులకు అనుమతి అవసరం లేదు
లాక్డౌన్ సమయంలో సరకులు రవాణా చేస్తున్న ట్రక్కులకు ఎలాంటి అనుమతి పత్రాలు అవసరం లేదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. డ్రైవర్లకు లైసెన్స్ ఉంటే సరిపోతుందని స్పష్టం చేసింది. సరకును లోడ్ చేసుకోవడానికి వెళ్లినా, అన్లోడ్ చేసి వస్తున్నా అధికారులకు ఎలాంటి పత్రాలు చూపించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.