పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు నిర్వహించాలని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సు చేసింది. మొత్తం 18 రోజులు సభ నిర్వహించాలని సూచించింది.
కొవిడ్ నేపథ్యంలో.. సమావేశాల కోసం పార్లమెంట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భౌతిక దూరం ఉండేలా ఎంపీలు కూర్చునే సీట్లను సర్దుబాటు చేస్తున్నారు. రాజ్యసభ సమావేశాలకు రెండు ఛాంబర్లతో పాటు, గ్యాలరీని ఉపయోగించుకోనున్నారు. 60 మంది ఎంపీలు ఛాంబర్లో, 51 మంది గ్యాలరీల్లో, మిగిలిన 132 మంది లోక్‌సభ హాల్లో కూర్చునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. లోక్‌సభలోనూ ఇలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సభ్యులు సభా కార్యక్రమాలు వీక్షించేలా డిజిటల్ స్క్రీన్‌లు, కరోనా నివారణకు అల్ట్రా వైలెట్ క్రిమిసంహారక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.
సాధారణంగా ఒకే సమయంలో జరిగే లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలను విడతలవారీగా నిర్వహించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. అయితే సభల నిర్వహణ సమయంపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.