పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బాంబే హైకోర్టు వద్ద 50 మందికి పైగా న్యాయవాదులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. గేటు బయట నిల్చుని రాజ్యాంగం ముందుమాటను చదివి వినిపించారు. ఆరు వర్గాలకు చెందిన శరణార్థులకు దేశ పౌరసత్వం కల్పిస్తూ.. ముస్లింలకు మాత్రం ఆ సదుపాయం కల్పించకపోవడం రాజ్యాంగపరంగా తప్పని వెల్లడించారు.
సీనియర్ కౌన్సిలర్లు నవ్రోజే సీర్వాయ్, గాయత్రి సింగ్, మిహిర్ దేశాయ్‌తో పాటు తదితరులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు.
బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ దేశాల నుంచి వచ్చే హిందూ, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, పార్శీ, జైన మతాలకు చెందిన శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించే పౌరసత్వ సరవణ చట్టానికి ఇటీవలే పార్లమెంట్‌తో పాటు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎద్దున ఆందోళనలు కొనసాగుతున్నాయి.