"ప్రియమైన బెంగళూరు నగర ట్రాఫిక్ పోలీసులారా.. శాంతినగర్ బస్టాండ్ దగ్గర నిన్న పొరపాటున ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేశా. నేను స్వచ్ఛందంగా ఫైన్ కట్టేయొచ్చా?" అంటూ పోలీసులకు ఓ వ్యక్తి చేసిన ట్వీట్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పోస్ట్‌కు పోలీసులు ఇచ్చిన జవాబు కూడా చర్చనీయాంశమైంది. ఇంతకీ ఏమైందంటే..
బాలకృష్ణ బిర్లా అనే వ్యక్తి బెంగళూరులో ఉంటారు. ఏదో పనిపై ఈనెల 27న తన వాహనంలో బయటకు వెళ్లారు. హడావుడిలో చూసుకోకుండా శాంతినగర్ బస్టాండ్ దగ్గర సిగ్నల్ జంప్ చేశారు. కానీ.. తప్పు చేశానన్న భావన ఆయన్ను వెంటాడింది. ఇంటికి వచ్చినా ప్రశాంతత లేదు. అందుకే ఈ నేరానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అనుకున్నారు బాలకృష్ణ బిర్లా.
బుధవారం బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల అధికారిక హ్యాండిల్‌ను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు బాలకృష్ణ. ట్రాఫిక్ సిగ్నల్ జంప్ నేరానికి పాల్పడినందుకు స్వచ్ఛందంగా జరిమానా కట్టేస్తానని ముందుకొచ్చారు. గురువారం ఉదయం ఈ బిర్లా ట్వీట్‌కు స్పందించారు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు. "చలానా వచ్చాక మీరు ఫైన్ కట్టేయొచ్చు" అని రిప్లై ఇచ్చారు.
ఇవీ చదవండి: 'ఇసుక' దొంగల ముఠాల మధ్య కాల్పులు.. నలుగురు మృతి
'అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయట్లేదు'.. గహ్లోత్ ప్రకటన.. సోనియాకు క్షమాపణ