AZADI KA AMRIT MAHOTSAV: జర్మన్ నియంత హిట్లర్ జాత్యహంకారంతో యూదులను ఊచకోత కోస్తే... అదే జాత్యహంకారం, వివక్షలతో లక్షల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయేలా చేశాడు చర్చిల్. బ్రిటన్ ప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు.. హిట్లర్‌కు ఏమాత్రం తీసిపోనివే. 1943 బెంగాల్ క్షామంలో... 30 లక్షల మంది పిట్టల్లా రాలిపోయారు. గుట్టలుగుట్టల్లా వీధుల్లో ప్రాణాలు విడిచారు.
churchill bengal famine
బ్రిటిష్ హయాంలో మన దేశంలో అనేకసార్లు కరవు కాటకాలు సంభవించాయి. వాటిలో చాలామటుకు ప్రకృతి సంబంధమైనవైతే... 1943లో వచ్చిన బెంగాల్ క్షామం... చర్చిల్ నిర్ణయాలతో తలెత్తినదేనని ఆర్థికవేత్తలు తేల్చిచెప్పారు. రెండో ప్రపంచయుద్ధ నేపథ్యంలో ఐరోపా భవిష్యత్తును, వారి సైనికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని... భారతీయులకు తిండి దొరక్కుండా చేశాడు చర్చిల్. తన యుద్ధ కేబినెట్ భారత్‌లో క్షామం గురించి హెచ్చరించినా చర్చిల్ వినలేదు. ఒకవైపు ఇక్కడ తిండి గింజల కోసం ప్రజలు అలమటిస్తుంటే.. 1943 జనవరి నుంచి జులై మధ్య భారత్ నుంచి 70వేల టన్నుల బియ్యాన్ని లండన్‌లోని గోదాములకు తరలించారు. యుద్ధానంతరం పరిస్థితి ఎలా ఉంటుందోనని ముందస్తుగా గోదాముల్లో దాచి పెట్టారు. అదే మొత్తం భారత్‌లో అందుబాటులో ఉంటే 4లక్షల మందికి ఏడాదంతా సరిపోయేది. అంతేకాకుండా... జపాన్ దాడి చేస్తుందనే భయంతో బెంగాల్ తీరప్రాంతంలో ఆంక్షలు విధించాడు.
1943 bengal famine
బెంగాల్‌లో క్షామం ఎంతగా విలయతాండవం చేసిందంటే... తల్లిదండ్రులు తిండి పెట్టలేని అశక్తులై తమ పిల్లల్ని చెరువులు, బావుల్లో విసిరేశారు. మరికొంతమంది పిల్లల్ని అమ్మేశారు. ఆకలికి తాళలేక అనేక మంది రైళ్లకింద పడి చనిపోయారు. చెట్ల ఆకులు, గడ్డి తిని బతికేందుకు ప్రయత్నించారు. ఇక కొంతమంది మహిళలు... తమ కుటుంబాలను పోషించుకోవటానికి కోల్‌కతాకు తరలి పడుపువృత్తిలోకి మారారు. చనిపోయిన తమవారికి అంత్యక్రియలు చేసే శక్తి కూడా ఒంట్లో లేక అలాగే విడిచిపెట్టేశారు. బెంగాల్ గ్రామాల్లో... గుట్టలు గుట్టలుగా పడ్డ శవాల కుప్పలపై రాబందులు... విందు చేసుకున్నాయి.
Vinston churchill on India
ఆ సమయంలో భారతీయుల దుస్థితిని చూసి బ్రిటిష్ వైస్రాయే కదిలిపోయారు. తక్షణమే ఆహార ధాన్యాలు కావాలంటూ స్వయంగా లండన్‌కు లేఖలు రాశారు. కానీ... చర్చిల్ ప్రభుత్వం వాటన్నింటినీ తిరస్కరించింది. భారత్‌కు ధాన్యం పంపిస్తే... భవిష్యత్ అవసరాల కోసం బ్రిటన్ గోదాముల్లో దాచిన నిల్వలు తగ్గిపోతాయని సాకు చెప్పింది. అంతేగాకుండా... "భారత్‌కు ఎంత ధాన్యం పంపినా సరిపోదు. ఎందుకంటే... భారతీయులు ఎలుకలు కన్నట్టు పిల్లల్ని కంటున్నారు. నిజంగా అంత సమస్యే ఉంటే గాంధీ ఇంకా ఎందుకు చావలేదు" అని చర్చిల్ వ్యాఖ్యానించాడు. ఈ విషయాన్ని అప్పటి బ్రిటన్‌లో భారత వ్యవహారాల మంత్రి లార్డ్ లియో ఆమ్రే స్వయంగా వెల్లడించారు. ఆ సమయంలో భారత్‌లో వైస్రాయ్‌గా ఉన్న లార్డ్ వేవెల్ సైతం... "బ్రిటిష్ హయాంలో చోటు చేసుకున్న అత్యంత దారుణమైన క్షామమిది. మా సామ్రాజ్య ప్రతిష్ఠకు ఇది మాయని మచ్చ" అని వాపోయాడు.
భారత స్వాతంత్య్రాభిలాషను వ్యతిరేకించిన చర్చిల్ భారతీయులపై పదేపదే నోరుపారేసుకునేవాడు. "ఆటవిక దేశం... ఆటవిక మతం... ఆటవిక నాయకుడు" అని భారత్ గురించి చర్చిల్ దారుణంగా వ్యాఖ్యానించినట్లు లియో ఆమ్రే వెల్లడించారు. గాంధీని చర్చిల్ అర్ధనగ్న ఫకీర్ అని ఈసడించుకునేవాడు.
భారత స్వాతంత్య్రాన్ని వ్యతిరేకించిన చర్చిల్ రహస్యంగా జిన్నాను రెచ్చగొట్టాడు. స్వాతంత్య్రం అనివార్యమైనప్పుడు... పాకిస్థాన్‌తో పాటుగా తమ చెప్పుచేతుల్లో ఉండే సంస్థానాధీశులతో ప్రిన్సిస్థాన్‌ను కూడా ఏర్పాటు చేసేందుకు కుట్రలు పన్నాడు.
ఇదీ చదవండి: Azadi Ka Amrit Mahotsav: భాష మార్చి... 'అమృత' దాడి