1937 కంటే ముందు కూడా భారత్‌లో ఎన్నికలు జరిగాయి. కానీ ఈ ఎన్నికలు మాత్రం వాటన్నింటికంటే భిన్నమైనవి. గతంలో జరిగిన వాటిలో కేవలం 3శాతం జనాభాకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. గెలిచిన వారికీ అధికారాలు నామమాత్రమే. ఆంగ్లేయ అధికారులదే పెత్తనమంతా. 1935లో అమల్లోకి వచ్చిన భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1937 ఎన్నికల్లో దేశంలోని సుమారు 3 కోట్ల మంది ప్రజలకు (14 శాతం) ఓటుహక్కు విస్తరించింది. తొలిసారిగా 42 లక్షల మంది మహిళలకూ ఓటు వేసే అవకాశం కల్పించారు. అన్నింటికీ మించి.. గెలిచిన ప్రజాప్రతినిధులకు రాష్ట్రాల్లో పాలన పరంగా విస్తృత అధికారాలనిచ్చారు. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులకు మైనార్టీ అవార్డు కింద ప్రత్యేక సీట్లు కేటాయించారు.
ఈ ఎన్నికల్లో పాల్గొనాలా వద్దా అనే అంశంపై జాతీయ కాంగ్రెస్‌లో తర్జనభర్జన కొనసాగింది. ఎన్నికలను బహిష్కరించాలని అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు నెహ్రూ, ఇతర సోషలిస్టులు వాదించారు. కానీ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలు మాత్రం తమకు తొలిసారి విస్తృతాధికారాలు లభింపజేస్తున్న ఈ ఎన్నికల్లో పోటీపడాలని ఉబలాటపడ్డారు. ఎన్నికల్లో పాల్గొనాలి.. కానీ అధికారం చేపట్టాలో లేదో తర్వాత నిర్ణయిద్దామంటూ గాంధీజీ రాజీ కుదిర్చారు. ఎన్నికల మంత్రాంగాన్ని సర్దార్ పటేల్ చూసుకోగా, ప్రచార బాధ్యతల్ని నెహ్రూ చేపట్టారు. స్వయంగా నెగ్గే 'స్తోమత' ఉండటం; ఇతరులు నెగ్గేందుకు 'దోహదపడటం'... అభ్యర్థుల ఎంపికకు ప్రధాన అర్హతలయ్యాయి. ఫలితంగా అప్పటిదాకా ఉద్యమంలో ఉన్నవారికంటే అనేకమంది జమీందార్లు, డబ్బున్నవారు రంగంలోకి దిగారు. కాంగ్రెస్‌కు కాకుండా ఇతరులకు వేసే ఓటు దేశ స్వాతంత్య్రానికి, దేశభక్తికి వ్యతిరేకమవుతుందని నెహ్రూ పిలుపునిచ్చారు. దీనిపై దుమారం రేగింది. ముఖ్యంగా ముస్లింలీగ్ నేత మహమ్మద్ అలీ జిన్నా దీన్ని తిప్పికొట్టాడు. దేశంలోని ముస్లింలంతా తమ వెంటే ఉన్నారని ప్రకటించాడు. కాంగ్రెస్, లీగ్‌ల మధ్య విభేదాలతో తమ ఆధిపత్యం సుస్థిరం అవుతుందని ఆంగ్లేయ సర్కారు ఆశించింది.
కోటిన్నర మంది ఓటు హక్కు వినియోగించుకున్న ఈ ఎన్నికల్లో తీరా చూస్తే ఫలితాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. 1595 సీట్లలో కాంగ్రెస్ 719 (45శాతం) మాత్రమే గెల్చుకుంది. 11 రాష్ట్రాలకుగాను ఐదింటిలోనే (మద్రాసు, ఒడిశా, బిహార్, యునైటెడ్ ప్రావిన్స్, సెంట్రల్ ప్రావిన్స్) పూర్తి మెజార్టీ వచ్చింది. ముస్లింలీగ్ 6.7 శాతం ఓట్లతో కేవలం 106 సీట్లే గెల్చుకోగలిగింది. ముస్లింలు మెజార్టీగాగల పంజాబ్, బెంగాల్, అస్సాం, సింధ్, వాయవ్య సరిహద్దు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీకి దారుణ పరాభవం ఎదురవటం ఈ ఎన్నికల ప్రత్యేకత. వాయవ్య సరిహద్దు రాష్ట్రంలో ముస్లింలీగ్‌కు ఒక్క సీటు కూడా రాలేదు. ముస్లిం జనాభా అధికంగాగల పంజాబ్‌లో 84 రిజర్వ్ సీట్లకుగాను 2 మాత్రమే జిన్నా పార్టీ ఖాతాలో పడ్డాయి. యునైటెడ్ ప్రావిన్స్, ముంబయిలో మాత్రమే లీగ్ ఉనికి చాటుకుంది. పంజాబ్‌లో కాంగ్రెస్, ముస్లింలీగ్‌కు షాక్ ఇస్తూ.. హిందూ-ముస్లింల సంయుక్త ప్రాంతీయ పార్టీ అయిన యూనియనిస్ట్ పార్టీ సికిందర్ హయత్‌ఖాన్ సారథ్యంలో అధికారంలోకి వచ్చింది. అలాగే.. బెంగాల్‌లోనూ ప్రాంతీయ పార్టీ (ఫజుల్‌హక్ నేతృత్వంలోని క్రిషక్ ప్రజాపార్టీ) సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముంబయిలో పోటీ చేసిన అంబేడ్కర్ నాయకత్వంలోని ఇండిపెండెంట్ లేబర్ పార్టీ 13 చోట్లే గెలిచింది. అలా జాతీయోద్యమం ఉద్ధృతంగా సాగుతున్న రోజుల్లో.. గాంధీజీ మార్గదర్శనంలో నడుస్తున్న కాంగ్రెస్‌కు, ముస్లింలందరికీ మేమే ప్రతినిధులం అంటూ విర్రవీగిన జిన్నాపార్టీ ముస్లింలీగ్‌కూ షాక్ ఇచ్చి.. అప్పుడే ప్రాంతీయ పార్టీలను ప్రజలు అక్కున చేర్చుకున్నారు.
లీగ్, కాంగ్రెస్‌ల మధ్య పీటముడి: యునైటెడ్ ప్రావిన్స్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని కాంగ్రెస్‌కు ముస్లింలీగ్ ప్రతిపాదించింది. మంత్రివర్గంలో ముస్లిం ప్రతినిధులను తామే ఎంపిక చేస్తామని పట్టుబట్టింది. ఇందుకు కాంగ్రెస్ అంగీకరించలేదు. మంత్రివర్గంలో ఒక సీటు లీగ్‌కు ఇస్తామని.. రెండో అభ్యర్థిని తామే ఎంపిక చేస్తామని కాంగ్రెస్ ప్రతిపాదించింది. అంతేగాకుండా.. రాష్ట్రంలో ముస్లింలీగ్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయాలంది. జిన్నా అందుకు ససేమిరా అన్నాడు. ముస్లిం లీగ్ నుంచి ఇద్దరికి పదవులు ఇచ్చినా వారు మంత్రిమండలి నిర్ణయాలకు తీవ్ర విఘాతం కలిగిస్తారని కాంగ్రెస్ అనుమానపడింది. పైగా అప్పటికే ముస్లింలీగ్ నేతలు ఆంగ్లేయుల కనుసన్నల్లో పనిచేయటం ఆరంభించారు. అందుకే వారిని జాతీయ కాంగ్రెస్ దూరం పెట్టింది. 1937 నాటి ఆ రాజకీయ అంతరం రోజురోజుకూ పెరిగి.. ప్రత్యేక ప్రాంత డిమాండ్‌కు దారి తీసింది. తర్వాతి ఎన్నికల నాటికి ప్రజల్ని ఆకట్టుకునే పద్ధతులనూ పార్టీలకు నేర్పాయీ 1937 ఎన్నికలు!
ఇవీ చదవండి: పేద ప్రజల ఆకలి తీర్చాడని.. ఉరి తీశారు!
వారిని విడిపించేందుకు.. వివాహ నగలను విరాళంగా ఇచ్చిన వీర వనిత..