Akhilesh Yadav On India Alliance : కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను 2024లో గద్దె దించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ఇండియా కూటమిలో లుకలుకలు మొదలైనట్లు వస్తున్న వార్తలకు తాజా పరిణామాలు బలాన్ని చేకూరుస్తున్నాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి కాంగ్రెస్.. ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంపై ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అసహనం వ్యక్తం చేశారు. తమకు మధ్యప్రదేశ్‌లో ఎదురైన పరిస్థితే ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఎదురవుతుందని అన్నారు. ఇండియా కూటమి కేవలం పార్లమెంటు సీట్ల కోసం పరిమితమైందని తెలిసి ఉంటే.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఆహ్వానించిన సమావేశానికి తమ నేతలు వెళ్లే వారు కాదని పేర్కొన్నారు. వారి ఫోన్లు కూడా ఎత్తే వారిమి కాదని అఖిలేశ్ చెప్పారు.
గతంలో మధ్యప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ పనితీరుకు సంబంధించిన వివరాలు ఇచ్చామని.. రాత్రి ఒకటి వరకు జరిగిన ఆ సమావేశంలో 6 సీట్లు ఇస్తామని కాంగ్రెస్ ముఖ్య నేతలు హామీ ఇచ్చారని కానీ ఒక్కటి కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. ఆ నేతలకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని అఖిలేశ్ ఆరోపించారు. కాంగ్రెస్‌లోని స్థాయి లేని నాయకులు సమాజ్‌వాదీ పార్టీపై వ్యాఖ్యలు చేయకుండా ఆ పార్టీ నాయకత్వం కట్టడి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు దిగ్విజయ్‌సింగ్, కమల్‌నాథ్ మావాళ్లను చుట్టూ తిప్పుకొని మొండిచేయి చూపారని అఖిలేశ్ విమర్శించారు. కాంగ్రెస్ ఇతర పార్టీలను ఫూల్స్ చేస్తోందని మండిపడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపుర్‌లో మీడియాతో మాట్లాడిన అఖిలేశ్.. ఈ విషయంలో తాను గందరగోళానికి గురయ్యానంటూ వ్యంగ్య బాణాలు వదిలారు. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 17న జరగనున్న ఎన్నికల కోసం 33 మంది అభ్యర్థులను అఖిలేశ్ ప్రకటించారు. కాంగ్రెస్ తమకు సీట్లు కేటాయింటనప్పుడు SP అభ్యర్థులను ప్రకటిస్తే తప్పేంటని పేర్కొన్నారు.
రెండో జాబితా రిలీజ్ చేసిన కాంగ్రెస్
మరోవైపు మధ్యప్రదేశ్ ఎన్నికల కోసం 88 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో ఒక్క స్థానం మినహా అన్నింటికి అభ్యర్థులను ప్రకటించింది. అమ్లా నియోజకవర్గ అభ్యర్థిని పెండింగ్‌లో ఉంచింది. ఈ స్థానానికి మహిళా డిప్యూటీ కలెక్టర్ నిషా బాంగ్రే పోటీపడుతున్నారు. ఈమె ఇప్పటికే.. తన రాజీనామాను సమర్పించగా.. అధికార బీజేపీ ప్రభుత్వం అంగీకారం తెలపలేదు. తొలి జాబితాలో 144 మంది అభ్యర్థులను ప్రకటించగా.. అందులో దతియా, గోటోగావ్, పిచ్చోరే అభ్యర్థులను మార్చింది.