మహారాష్ట్రలోని ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్ వేపై జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో నలుగురు మరణించారు. లోనావాలా సమీపంలోని వంతెనపై ఆయిల్ ట్యాంకర్లో మంటలు చెలరేగాయి. అనంతరం ట్యాంకర్ పేలడం వల్ల మంటలు ఎక్స్‌ప్రెస్‌వే కింద వెళ్తున్న ప్రయాణికలకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 12 ఏళ్ల బాలుడు సహా మరో ముగ్గురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ట్యాంకర్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్ వేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఉపముఖ్యమంత్రి ఫడణవీస్ సంతాపం
ఈ ప్రమాద ఘటనపై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపిన ఫడణవీస్.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఎక్స్‌ప్రెస్ వేపై ఒకవైపు ట్రాఫిక్‌ను పునరుద్ధించామని.. అతి త్వరగానే మరో రోడ్డును రాకపోకలను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.
భోపాల్ సాత్పురా భవన్‌లో మంటలు.. సైన్యం సాయంతో అదుపులోకి..
Bhopal Satpura Bhawan Fire : మరోవైపు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో కీలక ప్రభుత్వ కార్యాలయాలున్న సాత్పురా భవన్‌లో ఎట్టకేలకు మంటలను అదుపు చేశారు. ఇందుకోసం భారత సైన్యం, వాయసేన, స్థానిక సహాయక బృందాలు దాదాపు 14 గంటలకు పైగా నిరంతరం శ్రమించాయి. మంటలు చెలరేగిన వెంటనే సిబ్బందిని బయటకు తరలించడం వల్ల ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సహా హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మాట్లాడి సాయం కోరారు ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్.
ఇదీ జరిగింది
సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ భవనంలోని మూడో అంతస్తులో ఆదివాసీ సంక్షేమశాఖ ప్రాంతీయ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. అనంతరం ఈ అగ్నికీలలు పైనున్న మూడు అంతస్తులకు కూడా వ్యాపించాయి. ఎయిర్ కండీషనర్లు, గ్యాస్ సిలిండర్లకు మంటలు తాకడం వల్ల పేలుళ్లు కూడా సంభవించాయి. ఈ ప్రమాదంలో ఆరోగ్యశాఖకు చెందిన అత్యంత కీలకమైన ఫైళ్లు మంటల్లో కాలిపోయాయి. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేసినట్లు భోపాల్ పోలీస్ కమిషనర్ హరినారాయణ చారి మిశ్రా చెప్పారు. తమ నిపుణుల బృందాలు ఈ ఘటనకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నాయని ఆయన వివరించారు.
ఇవీ చదవండి : ఆర్మీ ట్రక్కులో మంటలు.. ఐదుగురు జవాన్లు మృతి.. పిడుగు పడిందని..
భవనంలో పేలిన గ్యాస్ సిలిండర్.. నలుగురు చిన్నారులు సజీవ దహనం