Aadhar reunites mother and child: ఆరేళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఓ యువకుడిని తల్లి చెంతకు చేర్చింది ఆధార్ కార్డు. మూగవాడైన యువకుడిని కనిపెట్టడంలో సాయపడింది.
mother and child reunite after 6 years:
యెలహంక తాలుకా సింగనాయకనహళ్లికి చెందిన పార్వతమ్మ.. కూరగాయలు అమ్ముతూ జీవనం సాగించేది. 2016లో తన కొడుకు భరత్‌ను వెంట తీసుకొని కూరగాయలు అమ్మేందుకు బయటకు వెళ్లింది. అప్పుడు భరత్‌కు 13 ఏళ్లు. స్నాక్స్ కొనుక్కునేందుకు తల్లి దగ్గరి నుంచి రూ.20 తీసుకొని వెళ్లిన భరత్... తిరిగి రాలేదు. కొడుకు కోసం పార్వతమ్మ చుట్టుపక్కల చూసినా... ఎక్కడా కనిపించలేదు. యెలహంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసి.. ఆరేళ్లుగా ఎదురుచూపులతోనే కాలం గడిపింది ఆ తల్లి.
రైల్వే స్టేషన్ టు నాగ్‌పుర్
స్నాక్స్ కోసం వెళ్లిన భరత్.. మొదట యెలహంక రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి రైలులో మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు వెళ్లాడు. 10నెలలు నాగ్‌పుర్ స్టేషన్లోనే గడిపాడు. దిక్కుతోచక తిరుగుతున్న అతడిని రైల్వేస్టేషన్ అధికారులు గుర్తించి పునరావాస కేంద్రానికి తరలించారు. ఈ కేంద్రం అధికారులు భరత్ తల్లిదండ్రులు ఎవరోనని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే, యువకుడు మూగవాడు కావడం వల్ల ఎలాంటి వివరాలు తెలియలేదు.
ఆధార్ సెంటర్‌తో..
2020లో అధికారులు భరత్‌ను ఆధార్ సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లారు. కొత్త ఆధార్ కార్డు నమోదు కోసం ప్రయత్నించగా.. భరత్ పేరిట అప్పటికే ఆధార్ జారీ అయిన విషయాన్ని గుర్తించారు. అధికారులు ఆరా తీయగా.. బెంగళూరు అడ్రెస్‌తో భరత్‌కు ఆధార్ కార్డు ఉందని తేలింది. భరత్ తల్లి పార్వతమ్మ మొబైల్ నంబర్ సైతం దొరికింది.
దీంతో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖకు సమాచారం ఇచ్చారు. వీరు పోలీసులను సంప్రదించగా.. యెలహంకలో మిస్సింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. యెలహంక పోలీసులు వెంటనే పార్వతమ్మను సంప్రదించి.. వీడియో కాల్ ద్వారా భరత్‌తో మాట్లాడించారు. ఆరేళ్ల తర్వాత కొడుకును చూసేసరికి తల్లి కళ్లల్లో నీళ్లు ఆగలేదు. కొడుకు సైతం తన తల్లిని చూసి బోరున విలపించాడు. మార్చి 7న పార్వతమ్మ కుటుంబ సభ్యులతో కలిసి నాగ్‌పుర్‌కు వెళ్లింది. కొడుకును ప్రత్యక్షంగా చూసి గట్టిగా హత్తుకుంది.
ఇదీ చదవండి: ల్యాండింగ్‌లో అపశృతి.. రన్‌వే పైనుంచి పక్కకు జరిగిన విమానం