A Young Man Murdered in Nalgonda District : ఓ యువతిని ప్రేమించిన దళిత యువకుడు.. అమ్మాయి తరఫు బంధువుల చేతిలో పట్టపగలే హత్యకు గురైన విషాద ఘటన ఇది. వారి ఇద్దరివి వేర్వేరు కులాలు. అయినా ఇద్దరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో వారి ప్రేమను ఇరు కుటుంబాల్లో అంగీకరించలేదు. అయినా ఆ యువకుడు పెళ్లి విషయమై మాట్లాడేందుకు యత్నిస్తుండటంతో యువతి బంధువులు దానిని సహించలేకపోయారు. చివరకు అతనిని వేటాడి.. వెంటాడి.. కత్తులతో పొడిచి అంతమొందించారు. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా నిడమనూరు మండలం గుంటిపల్లిలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
త్రిపురాపురం మండలం అన్నారం గ్రామానికి చెందిన ఇరిగి నవీన్(21).. అదే గ్రామానికి చెందిన ఓ యువతి (20) గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నవీన్ మిర్యాలగూడలో కార్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల ఆ యువతికి కుటుంబసభ్యులు పెళ్లి సంబంధం చూశారని తెలిసి నవీన్ విషం కూడా తాగాడు. ఇది తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రిలో చేర్పించి.. చికిత్స అందించగా తిరిగి కోలుకున్నాడు. విషయం తెలుసుకున్న యువతి బంధువులైన మణిదీప్, నవదీప్, శివప్రసాద్‌లు పలుమార్లు నవీన్‌కు ఫోన్ చేసి యువతిని మరిచిపోవాలని, లేదంటే చంపేస్తామని బెదిరించారు. వీరిద్దరి కులాలు వేరు కావడంతో యువతి తల్లిదండ్రులూ నవీన్‌ను హెచ్చరించారు. ఆదివారం నవీన్.. అన్నారం గ్రామానికి చెందిన స్నేహితుడు ఈట అనిల్‌తో కలిసి.. నిడమనూరు మండలం గుంటిపల్లికి చెందిన పాల్వాయి తిరుమల్ వద్దకు వచ్చాడు. అమ్మాయి కుటుంబ సభ్యులతో మాట్లాడి.. తమ పెళ్లికి ఎలాగైనా ఒప్పించమని అతడిని కోరాడు.
యువతి బంధువులకు తిరుమల్ ఫోన్ చేసి మాట్లాడుకుందాం రమ్మని పిలిచాడు. దానికి వారు కూడా సరే వస్తున్నామని తెలిపారు. కాసేపటికి యువతి బంధువులు మూడు బైక్‌ల మీద తొమ్మిది మంది కత్తులతో వచ్చారు. వస్తూనే నవీన్‌పై దాడికి పాల్పడ్డారు. కత్తులతో బెదిరించడంతో స్నేహితుడు అనిల్, తిరుమల్ అక్కడి నుంచి పారిపోయారు. నవీన్ కూడా వారి దగ్గర నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో కొంత దూరం వెళ్లి కింద పడిపోయాడు. నిందితులు పారిపోతున్న నవీన్‌ను వెంటాడి ఛాతీ, పొట్ట భాగాల్లో దారుణంగా పొడిచారు. సమీపంలోని గ్రామస్థులు గుర్తించి నవీన్ దగ్గరకు వచ్చేసరికే అతడు మృతి చెందాడు.
సమాచారం తెలుసుకున్న మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి, హాలియా సీఐ గాంధీనాయక్, నిడమనూరు ఎస్సై శోభన్‌బాబుతో కలిసి ఘటనా స్థలికి వచ్చారు. నవీన్ స్నేహితుడు అనిల్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు డీఎస్పీ వెంకటగిరి తెలిపారు.
ఇవీ చదవండి: