తమిళనాడులో తొమ్మిదేళ్ల బాలుడు 427 గ్రామాలకు పెద్దగా ఎన్నికయ్యాడు. జావదు కొండల్లోని ఈ గిరిజన గ్రామాలకు ఈ కుర్రాడు 'పెదరాయుడి'గా వ్యవహరించనున్నాడు. తూర్పు కనుమలకు ఆనుకొని తిరువన్నామలై, వెల్లూర్, తిరుపట్టూర్ జిల్లాల్లో ఈ గ్రామాలు ఉన్నాయి.
గత 80 ఏళ్లుగా ఈ గ్రామాలకు పెద్దగా వ్యవహరించిన మల్లిమాడుకు చెందిన చిన్నంది(87) అనారోగ్య కారణాలతో గతేడాది చనిపోయారు. దీంతో ఆయన వారసుడిని ఎంపిక చేసేందుకు ఇన్నాళ్లు మల్లగుల్లాలు పడ్డారు. 36 గ్రామాల ప్రతినిధులు సమావేశమై.. చివరకు తమ సంప్రదాయం ప్రకారం మరణించిన చిన్నందిని ప్రసన్నం చేసుకొని ఆయన మనవడు శక్తివేల్‌ను ఎంపిక చేశారు. ఈ నిర్ణయాన్ని మిగిలిన గ్రామాల ప్రజలు స్వాగతించారు. నవాలూర్ పంచాయతీ పాఠశాలలో ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నాడు శక్తివేల్.
జావదు తెగ ప్రజలంతా పంచాయతీ వ్యవస్థను ఇప్పటికీ గౌరవిస్తారు. ఇక్కడ వెలువడిన తీర్పులను పాటిస్తారు. ఈ ప్రాంతంలో ఉన్న 427 గ్రామాలన్నింటికీ కలిపి ఓ పెద్ద ఉంటారు. అతని కింద ఒక్కో గ్రామానికి ఒక్కో అధిపతి, పెద్ద, శిక్షకుడు ఉంటారు. వీరంతా తమ ప్రాంతాల్లోని సమస్యను అన్ని గ్రామాల పెద్ద దృష్టికి తీసుకొస్తారు. ఈ గ్రామ పెద్ద.. పంచాయతీ పెట్టి ఈ సమస్యలను పరిష్కరిస్తాడు.
ఇదీ చదవండి: మూడో శస్త్ర చికిత్సతో ఆ రోగికి ఐదో కిడ్నీ