ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాకే పుట్టింటికి వస్తానని ఐదేళ్ల క్రితం ఓ మహిళ శపథం చేసింది. ఇటీవలే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో ఆమె స్వగ్రామానికి వెళ్లింది. ఆమె తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం గ్రామానికి చెందిన కట్టా గోపయ్య, సౌభాగ్యమ్మ దంపతుల నాలుగో కుమార్తె విజయలక్ష్మి.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడుకు చెందిన పెదనాటి నర్సింహారావును వివాహం చేసుకుంది. ఆమె తల్లిదండ్రులు చనిపోవడంతో ఐదేళ్ల క్రితం సొంత గ్రామంలో ఉంటున్న తోబుట్టువు వద్దకు వచ్చినప్పుడు అక్క కుమారుడు తాళ్లూరి ప్రసాద్‌కి రాజకీయంగా భిన్నవాదనలు తలెత్తాయి. దీంతో ఆమె చంద్రబాబు అధికారంలోకి వస్తేనే మళ్లీ ఊళ్లోకి వస్తానని శపథం చేసి వెళ్లారు. అప్పటి నుంచి మొన్నటి వరకు పుట్టింట్లో ఎలాంటి కార్యక్రమాలు జరిగిన ఆమె హాజరు కాలేదు. తాజాగా చంద్రబాబు ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో శనివారం ఆమె పుట్టింటికి వెళ్లారు.