TG HC on Sound Pollution From Function Halls in Hyd : హైదరాబాద్‌లో ఫంక్షన్ హాళ్లల్లో శబ్ద నియంత్రణకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసి ఊరుకుంటే చాలదని, వాటిని అమలు చేసేలా చర్యలు తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫంక్షన్ హాళ్లలో శబ్ద నియంత్రణపై జారీ చేసిన ఉత్తర్వుల అమలుపై స్థాయీ నివేదికను సమర్పించాలంటూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
సికింద్రాబాద్ తాడ్బండ్, బోయినపల్లిలోని బాంటియా గార్డెన్స్, ఇంపీరియల్ గార్డెన్స్ ఫంక్షన్ హాళ్ల వల్ల పరిమితికి మించిన శబ్దాలతో ఇబ్బందిగా ఉంటోందని మిలిటరీ అదనపు చీఫ్ ఇంజినీర్ కల్నల్ జె.సతీష్ భరద్వాజ్ రాసిన లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె.అనిల్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.