Pocso Case on HM : విద్యాబుద్ధులు నేర్పించి సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే, వక్ర బుద్ధితో వ్యవహరించడం తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. భయపడిన సదరు విద్యార్థి తోటి విద్యార్థినులకు చెప్పడంతో విషయం బయటకు పొక్కింది.
అది కాస్తా తల్లిదండ్రుల దృష్టికి వెళ్లడంతో వారంతా పాఠశాలకు వెళ్లి నిలదీశారు. విషయం జిల్లా బాలల సంక్షేమ కమిటీ సభ్యుల వద్దకు చేరడంతో విచారణకు ఆదేశించారు. విచారణలో నిజమని తేలడంతో ప్రధానోపాధ్యాయుడుతో పాటు కేసులో రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించిన మరో 9 మందిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. హెచ్‌ఎం మరో నలుగురైదుగురు విద్యార్థినులను సైతం వేధించినట్లు సమాచారం.