International Telugu Mahasabhalu : ప్రపంచ తెలుగు మహాసభలు 2026 జనవరిలో అమరావతిలో నిర్వహించనున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ వెల్లడించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు దేశ రాష్ట్రపతి, ప్రధానిని కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తెలుగువారు ఎక్కువగా నివసించే దేశాల అధ్యక్షులు, ప్రధానులను కూడా ఆహ్వానిస్తామన్నారు.
2022లో భీమవరంలో 2024లో రాజమహేంద్రవరంలో మహాసభలు నిర్వహించామని, ఇదే స్ఫూర్తితో ఈసారి అమరావతిలో జరపాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. తెలుగు భాషా వైభవాన్ని పరిరక్షించి, తెలుగు కీర్తిని నలుదిశలా చాటటంతో పాటు నేటి తరాలకు మన భాష గొప్పదనాన్ని తెలియజెప్పటమే ఈ సమావేశాల లక్ష్యమన్నారు. ఈ మహాసభలకు కన్వీనర్‌గా రామచంద్రరాజుని నియమించారు. మహాసభల్ని జయప్రదంగా నిర్వహించటం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కన్వీనర్ రామచంద్రరాజు తెలిపారు.