Man Loses Rs 67 Lakh : మనీలాండరింగ్ కేసులో మీ ఆధార్ నంబర్ ప్రమేయం ఉందని భయపెట్టి, హైదరాబాద్ అమీర్‌పేటకు చెందిన ఓ వృద్ధుడి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.67 లక్షల 33 వేలు కాజేశారు. ఆధార్ నంబర్‌ను వినియోగించి, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని, దీనిపై కేసు నమోదైందని బాధితుడిని ఫోన్‌లో బెదిరించారు. వెంటనే వీడియో కాల్ చేసిన నేరగాళ్లు, పోలీస్ యూనిఫామ్‌లో కనిపించారు. తాము సీబీఐ, కోఠి పోలీస్‌స్టేషన్ నుంచి మాట్లాడుతున్నామని తెలిపారు.
మనీలాండరింగ్ కేసు నమోదైనందున ఖాతాలన్నీ ఖాళీగా ఉంచాలని, తాము చెప్పిన ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తే భధ్రంగా ఉంటుందని చెప్పారు. కేసు మూసేసిన వెంటనే తిరిగి పంపిస్తామన్నారు. నమ్మిన బాధితుడు, తన రిటైర్మెంట్ సొమ్ము రూ.67.33 లక్షల మొత్తాన్ని వారికి బదిలీ చేశాడు. డబ్బు తిరిగి పంపకపోగా, ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో మోసమని తెలుసుకున్న బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.