Israel attacks On Hezbollah : కాల్పుల విరమణ కోసం ఒకవైపు చర్చలు సాగుతుండగా మరోవైపు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గర్జించాయి. హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఈ తెల్లవారుజామున ఇజ్రాయెల్ దళాలు వరుస క్షిపణులతో దాడులు చేశాయి. తమ భూభాగంపై భారీ రాకెట్లు, క్షిపణులతో దాడి చేసేందుకు హెజ్‌బొల్లా సిద్ధమైనట్లు తమకు సమాచారం అందినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అందుకే ముందుస్తు దాడిగా తామే దక్షిణ లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది.
దీనికి ప్రతీకారంగా హెజ్‌బొల్లా ప్రతిదాడులు చేసింది. పెద్దసంఖ్యలో డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై దాడులు చేసినట్లు హెజ్‌బొల్లా ప్రకటించింది. శత్రుస్థావరాలు, బ్యారెక్‌లు, ఐరన్ డోమ్ ప్లాట్‌ఫారమ్ లక్ష్యంగా డ్రోన్లతో దాడులు జరిపనట్లు పేర్కొంది. మరోవైపు గాజా స్ట్రిప్‌లో జరిగిన దాడుల్లో నలుగురు రిజర్వ్ సైనికులు మరణించినట్లు, ఇజ్రాయెల్ ప్రకటించింది. అటు యుద్ధం కారణంగా ఇప్పటివరకు 40వేల 200 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది.