Muda Case Siddaramaiah : ముడా కుంభకోణం కేసులో తనను విచారించేందుకు గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ అనుమతి ఇవ్వడాన్ని సీఎం సిద్ధరామయ్య కర్ణాటక హైకోర్టులో సవాల్ చేశారు. విచారణ కోసం గవర్నర్ ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోరుతూ న్యాయస్థానంలో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సోమవారం జస్టిస్ హేమంత్ చందన్‌గౌడార్ సింగిల్ జడ్జి బెంచ్ విచారించనుంది.
మరోవైపు ఈ వ్యవహారంలో వెంటనే జోక్యం చేసుకుని గవర్నర్ ఇచ్చిన అనుమతులను రద్దు చేసేలా ఆదేశించాలని కర్ణాటక కాంగ్రెస్, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరింది. ఈ ఆదేశాలు చట్టవిరుద్ధమని సీఎం సిద్ధరామయ్య తప్పుబట్టారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్, దిల్లీ తరహాలో కర్ణాటకలోనూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు గవర్నర్ గహ్లోత్ కొమ్ముకాస్తున్నారని నిందించారు. కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారిన గవర్నర్ ఆదేశాలపై న్యాయపోరాటం చేస్తామన్నారు.